Anushka Shetty: అవన్నీ పుకార్లే.. దర్శకుడితో తన పెళ్లి వార్తలను కొట్టిపారేసిన అనుష్క

Anushka Shetty thrashes rumours on her alleged wedding with a director
  • నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం
  • పుకార్ల వల్ల నేనేమీ ఇబ్బంది పడను 
  • పెళ్లి విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్న స్వీటీ
టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి పెళ్లి విషయంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది.  ఫలానా హీరోను అనుష్క పెళ్లాడబోతోందని, ఓ క్రికెటర్‌‌తో  ఆమె ప్రేమలో ఉన్నదని పుకార్లు వస్తున్నాయి. ఇప్పటికే విడాకులు తీసుకున్న ఓ యువ దర్శకుడితో ఆమె పెళ్లి కుదిరిందన్న వార్త కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దీనిపై అనుష్క స్పందించింది. టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడి కుమారుడు అయిన సదరు వ్యక్తితో తన పెళ్లి విషయం ఒట్టి పుకారే అని కొట్టిపారేసింది.

తన పెళ్లి గురించి కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి పుకార్ల వల్ల తానేమీ ఇబ్బంది పడనని చెప్పింది. అయితే, తన పెళ్లి గురించే అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని అనుష్క వాపోయింది. వివాహం అనేది తన వ్యక్తిగత విషయమని అనుష్క చెప్పింది. ఇతరులు తన వ్యక్తిగత జీవితంలోకి చొరబడితే తనకు అస్సలు నచ్చదని స్పష్టం చేసింది.  

బంధాలను ఎవరూ దాచలేరని, అలాగే తన పెళ్లి విషయాన్ని బయటపెట్టకుండా తానెందుకు దాస్తానని ఆమె అభిప్రాయపడింది. అయితే, ఎవరిని పెళ్లిచేసుకోబోయేది బహిరంగంగా ప్రకటించకపోవచ్చు అని చెప్పింది. కానీ, పెళ్లి జరిగిన తర్వాత ఈ విషయం గురించి తనను ఎవరైనా అడగొచ్చని, వాళ్లకు సమాధానం చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపింది.

కాగా, అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సస్పెన్స్‌–థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మైఖేల్ మాడ్సెన్‌, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించారు.
Anushka Shetty
thrashes rumours
alleged wedding with a director
Tollywood

More Telugu News