Sudha Murty: ఏసీల్లో కరోనా వృద్ధి అధికం.. మాల్స్‌, సినిమా థియేటర్లు మూసేయండి: సుధా మూర్తి సూచన

  • కర్ణాటక ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌‌పర్సన్ సుధా మూర్తి సూచన
  • అధిక ఉష్ణోగ్రతల్లో వైరస్‌ చనిపోతుందని నిర్ధారణ కాలేదు 
  • ప్రభుత్వంత కలిసి పనిచేస్తామని ప్రకటన
Karnataka government should to take steps to shut malls and theatres says Sudha Murty

కరోనా వ్యాప్తి చెందకుండా కర్ణాటకలో అన్ని షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్ చైర్‌‌పర్సన్‌ సుధా మూర్తి సూచించారు. ఏసీ ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్‌ అధికంగా వృద్ధి చెందుతుంది కాబట్టి పాఠశాలలు, కళాశాలలతో పాటు మాల్స్‌, థియేటర్లను తక్షణం మూసివేయాలన్నారు.

ఫార్మసీ, నిత్యావసర షాపులు, పెట్రోల్ బంకులను మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. ప్రభుత్వ అధీనంలో నడిచే కర్ణాటక టూరిజం టాస్క్ ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న సుధా మూర్తి... ప్రస్తుత పరిస్థితి గురించి తాను నారాయణ హెల్త్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టితో మాట్లాడినట్టు తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్‌ చనిపోతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని సుధా మూర్తి పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్‌‌లో ప్రస్తుతం మండు వేసవి అయినప్పటికీ ఆ దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ కరోనా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చితే ప్రభుత్వ ఆసుపత్రులు మినహా ఏ ఒక్క ప్రైవేట్ అసుపత్రి కూడా వైరస్‌ కేసులను తట్టుకోలేదన్నారు. అందువల్ల 500 నుంచి 700 పడకలు ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రిని కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేకంగా కేటాయించాలని సర్కారుకు సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ సిద్ధంగా ఉందని సుధా మూర్తి తెలిపారు.

More Telugu News