Ruwanda: చైతన్యంలో పెద్ద దేశం.. 'ఉముగాండా'తో రువాండాకు సోకని కరోనా!

  • పాతికేళ్ల క్రితం మారణహోమంతో అతలాకుతలం
  • ఆపై క్రమంగా అభివృద్ధి
  • ప్రభుత్వ చర్యలతో దేశమంతా పరిశుభ్రత
  • విదేశీ టూరిస్టులను ఆహ్వానిస్తున్న ప్రభుత్వం
Umuganda In Ruwanda

రువాండా... ఆఫ్రికా దేశాల్లో ఓ చిన్న దేశం. 1994 ప్రాంతంలో భయంకరమైన మారణ హోమంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం. ఆపై క్రమంగా అభివృద్ధి సాధిస్తూ, మధ్య ఆఫ్రికాలోనే శరవేగంగా వృద్ధి రేటును పెంచుకుంటున్న దేశం. ఈ దేశానికి కరోనా సోకలేదు. అందుకు కారణం... అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఉముగాండా'.

'ఉముగాండా'... ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడి ప్రభుత్వం ప్రజలను భాగస్వాములను చేస్తూ, చేసిన చట్టమే 'ఉముగాండా'. ఇప్పుడదే 'ఉముగాండా' తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించకుండా చేసిందని ఆ దేశ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

'ఉముగాండా' అనేది స్వచ్ఛంద కార్యక్రమం. ప్రతి నెలా చివరి శనివారంలో జరుగుతుంది. ప్రజలంతా తమంతట తాముగా వీధుల్లోకి వస్తారు. చట్టంలోని నిబంధనల ప్రకారం, వీధులన్నీ శుభ్రం చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లోని చెత్త, చెదారాలను తొలగిస్తారు.

అంతేకాదు... రువాండాలో బస్సెక్కే ప్రతి ఒక్కరూ, అంతకుముందుగా చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం ప్రతి బస్టాప్ లో వాష్ బేసిన్ లు ఉంటాయి. చేతులను కడుక్కోకపోతే బస్టాండ్ లోకి ఎంట్రీ కూడా ఉండదు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి వ్యవస్థ లేకపోవడం గమనార్హం.

ఆఫ్రికా దేశాల్లోనే రువాండా పరిశుభ్రతలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక్కడ పదేళ్ల క్రితమే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం గమనార్హం. ఇదే సమయంలో పర్యావరణాన్ని సైతం ఆ దేశ పాలకులు కాపాడుతున్నారు. నేరాల సంఖ్య కూడా చాలా తక్కువే. అమెరికా, బ్రిటన్, ఇండియా వంటి దేశాలు సైతం విదేశీ పర్యాటకులను నిషేధించిన వేళ, రువాండా మాత్రం అటువంటి ఆంక్షలేవీ తమ దేశంలో ఉండవని చెప్పడం గమనార్హం.

ఇక ఇదంతా చూసి, 'ఉముగాండా' గురించి ఎంక్వయిరీ చేస్తున్న నెటిజన్లు, ప్రతి దేశమూ రువాండాను ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News