Hyderabad: ఇందిరాపార్క్ వద్ద రణరంగం... ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో ఉద్రిక్తం!

tense create teachers JAC protest at indirapark in hyderabad
  • పీఆర్సీ, పాత పింఛన్ విధానాలకు సంఘాల డిమాండ్ 
  • ఈ రోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన 
  • చలో అసెంబ్లీని అడ్డుకోవడంతో వివాదం

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ఆందోళన రణరంగంగా మారింది. పాత పింఛన్ విధానం, కొత్త పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చాయి. అలాగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి.

అందులో భాగంగా ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయులను భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ ఆయా సంఘాల ప్రతినిధులు పార్క్ కూడలి వద్ద రోడ్డు పైనే బైఠాయించారు. దీంతో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. కాసేపటికి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

మరోవైపు అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ర్యాలీలు, నిరసనలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Hyderabad
Indirapark
Teachers JAC
Tense

More Telugu News