Nellore District: నెల్లూరు జిల్లా వాసికి కరోనా... రాష్ట్రంలో తొలి పాజిటివ్ కేసు నమోదు

First corona positive case registered in AP
  • కొన్నిరోజుల కిందట ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తి
  • కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరిక
  • శాంపిల్స్ ను తిరుపతి స్విమ్స్ ల్యాబ్ కు పంపిన వైద్యులు
  • పాజిటివ్ ఫలితంతో కరోనాగా నిర్ధారణ
ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తికి వైద్యపరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి కొన్నిరోజుల క్రితమే ఇటలీ నుంచి నెల్లూరు వచ్చారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఆ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి తిరుపతిలోని స్విమ్స్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా, కరోనా సోకినట్టు తేలింది. మరో రెండు వారాల తర్వాత అతనికి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.

ఏపీలో అనేకమంది కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నా, నెల్లూరు కేసే రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు. ఇటలీలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఒక్కరోజే 100కి పైగా మృతుల సంఖ్య నమోదవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. ఇప్పుడీ నెల్లూరు వ్యక్తికి కూడా ఇటలీలోనే కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
Nellore District
Corona Virus
Positive
Government Hospital

More Telugu News