Angela Merkel: 70 శాతం మంది జర్మనీ ప్రజలు కరోనా బారిన పడొచ్చు: ఏంజెలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు

  • మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంత చేయాలో అంతా చేస్తాం
  • వాక్సిన్ కనుక్కోకపోతే 70 శాతం మంది ప్రజలు దీని బారిన పడతారు
  • షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దు
Two Third Of Germans May Get Coronavirus says Angela Merkel

కరోనా వైరస్ ప్రభావం యూరప్ దేశాలపై తీవ్రంగానే ఉంది. దీని దెబ్బకు ఇటలీ అల్లాడిపోతోంది. మరో దేశం జర్మనీ కూడా వణికిపోతోంది. ఈ సందర్భంగా జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో మొత్తం జనాభాలో 70 శాతం మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆమె చెప్పారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంత చేయాలో అంతా చేస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయం గురించి ఆలోచిస్తామని చెప్పారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రమాదం తీవ్రంగానే ఉందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం ఇలాగే కొనసాగితే... ప్రజల్లో రోగ నిరోధక శక్తి లేకపోతే... కరోనాకు వాక్సిన్, చికిత్సను కనుక్కోకపోతే... దేశ జనాభాలో 60 శాతం నుంచి 70 శాతం వరకు ప్రజలు దీని బారిన పడతారని చెప్పారు.

ప్రజలంతా పరిశుభ్రంగా ఉండాలని మెర్కెల్ పిలుపునిచ్చారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని, కేవలం కళ్ల ద్వారా మాత్రమే పలకరించుకోవాలని చెప్పారు. యూరప్ దేశాలన్నింటితో కలసి కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై ఇది ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఇంకా అంచనా వేయలేదని చెప్పారు.

జర్మనీలో ఇప్పటి వరకు 3 కరోనా మరణాలు నమోదయ్యాయి. 1,567 మందికి ఈ వైరస్ సోకింది. మరోవైపు మెర్కెల్ వ్యాఖ్యలను చెక్ ప్రధానమంత్రి తప్పుబట్టారు. మెర్కెల్ వ్యాఖ్యలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News