Yadadri Bhuvanagiri District: సహోద్యోగి అని సర్ది చెప్పేందుకు వెళితే...చావు తరుముకొచ్చింది!

  • ప్రాణం మీదికి తెచ్చిన స్వల్ప వివాదం
  • సర్దిచెప్పి పంపించాడని వ్యతిరేకి వర్గీయుల దౌర్జన్యం
  • అతని చూపించాలని తీసుకువెళ్తుండగా రోడ్డు ప్రమాదం
mediator died in road accident

ఆటోలో వెళ్తున్న అతనికి తెలిసిన వ్యక్తి ఎవరితోనో గొడవ పడుతుండడం కనిపించింది. అయ్యో...ఏమైందా అనుకుని వెళ్లాడు. ఇరువర్గాలను సముదాయించిన ప్రయత్నంలో తనే ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.

వివరాల్లోకి వెళితే...యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన సింగిపాక పరమేష్ (29) పెద్దఅంబర్ పేటలోని తట్టి అన్నారం గ్రామపరిధి ఆర్.కె.నగర్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. మర్రిపల్లి సమీపంలోని ఓ తలుపులు తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో సహచర ఉద్యోగి రాజుతో కలిసి ఆటోలో వస్తున్నాడు.

దారిలో ఓ కారు యజమాని, ద్విచక్ర వాహన చోదకుడు గొడవ పడుతుండడం చూశాడు. బైక్ వ్యక్తిని తోటి ఉద్యోగి శ్రీనాథ్ గా గుర్తించి వెంటనే ఆటో ఆపించి అక్కడికి రాజుతో కలిసి వెళ్లాడు. కారులో ఉన్న ప్రశాంత్, సతీష్ అనే ఇద్దరికి నచ్చజెప్పి శ్రీనాథ్ ను పంపించేశాడు.

అయితే తమ కారు డ్యామేజీ అయ్యిందని, నష్టపరిహారం ఇవ్వకుండా శ్రీనాథ్ ను ఎందుకు పంపించేశావంటూ సతీష్, ప్రశాంత్ లు పరమేష్ పై దౌర్జన్యం చేయడమేకాక శ్రీనాథ్ ఎక్కడ ఉన్నాడో చూపించాలంటూ తమ కారు ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. అయితే కారు రాత్రి 9.30 గంటల సమయంలో కుంట్లూరు వైపు వస్తుండగా దారి మధ్యన అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో పల్టీకొట్టింది.

దీంతో సతీష్, ప్రశాంత్ లు పారిపోగా, తీవ్రంగా గాయపడిన రాజు, పరమేష్ లను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరమేష్ దారి మధ్యలోనే చనిపోగా, రాజు చికిత్స పొందుతున్నాడు. పరమేష్ కు ఓ కుమారుడు, కుమార్తె ఉండగా ఎనిమిది నెలల క్రితమే కుమార్తె చనిపోయింది.

ప్రస్తుతం భార్య గర్భవతి. తోటి ఉద్యోగికి సాయపడేందుకు మానవత్వంతో వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన పరమేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భోరుమన్నారు.

More Telugu News