BSE: మరో బ్లడ్ బాత్... పాతాళానికి జారిపోయిన నిఫ్టీ... 10 వేల దిగువకు!

  • బుధవారం స్థిరంగా నిలిచిన మార్కెట్
  • నేడు ఆరంభంలోనే భారీ నష్టం
  • జూలై 2017 తరువాత ఆ స్థాయికి నిఫ్టీ
  • 38 నెలల కనిష్ఠానికి మిడ్ క్యాప్
Blood Bath in India Stock Market

భారత స్టాక్ మార్కెట్లో మరో బ్లడ్ బాత్ నమోదైంది. నిన్న దాదాపు స్థిరంగా నిలిచిన బీఎన్ఎస్, ఎన్ఎస్ఈ సూచికలు, ఈ ఉదయం 9 గంటలకు ట్రేడింగ్ సెషన్ ప్రారంభం కాగానే పాతాళంలోకి జారిపోయాయి. 2017, జూలై 25న తొలిసారిగా 10 వేల మార్క్ ను అధిగమించిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, దాదాపు 31 నెలల తరువాత తిరిగి అదే స్థాయికి చేరింది. మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే 10 వేల పాయింట్ల దిగువకు చేరింది.

ఉదయం 9.45 గంటల సమయంలో నిఫ్టీ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 490 పాయింట్లు పతనమై 9,967 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే ఇది 4.7 శాతం తక్కువ. ఇదే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక, 1,645 పాయింట్లు పడిపోయి 4.61 శాతం నష్టంతో 34,051 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ -30, నిఫ్టీ-50 సూచికల్లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 38 నెలల కనిష్ఠానికి పతనం కావడం ఇన్వెస్టర్లలో గుబులును పెంచుతోంది. చమురు, వాహన రంగాల్లోని కంపెనీలకు నష్టం అధికంగా కనిపిస్తోంది.

ఇక ఆసియా మార్కెట్లలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొనివుంది. బుధవారం నాటి యూఎస్ మార్కెట్లో నాస్ డాక్ 4.70 శాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ నశించింది. దీంతో ఈ తెల్లవారుజామున జపాన్ నిక్కీ సూచిక 4.57 శాతం నష్టంలో ముగియగా, స్ట్రెయిట్స్ టైమ్స్ 3.89 శాతం, హాంగ్ సెంగ్ 3.81 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 4.47 శాతం, కోస్పీ 4.56 శాతం, సెట్ కాంపోజిట్ 8.66 శాతం, జకార్తా కాంపోజిట్ 4.07 శాతం నష్టపోయాయి.

More Telugu News