Kompally: చోరీ కోసం పక్కా ప్లాన్.. మణప్పురం గోల్డ్‌లోన్ షాపు పక్కనే అద్దెకు దిగిన యువకులు.. సీసీటీవీ వైరు కత్తిరించి దొరికిపోయిన వైనం!

  • కొంపల్లిలోని మణప్పురం గోల్డ్‌లోన్ దుకాణంలో ఘటన
  • ఉప్పల్ వాసులమని నమ్మించి దుకాణం పక్కనున్న గది అద్దెకు
  • పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
Youth try to steal Manappuram Gold loan shop in Hyderabad

మణప్పురం గోల్డ్‌లోన్ దుకాణంలో చోరీ చేసేందుకు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన దొంగలకు చివరి నిమిషంలో ఆశాభంగమైంది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యారు. హైదరాబాద్ శివారులోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.  

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు యువకులు కొంపల్లిలోని మణప్పురం గోల్డ్ దుకాణాన్ని ఆనుకుని ఉన్న చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం ఉప్పల్ చిరునామాతో ఉన్న నకిలీ ఆధార్ కార్డులను ఇంటి యజమానికి చూపించారు. తాము సెల్‌ఫోన్లు రిపేర్ చేస్తామని నమ్మబలికారు.

మంగళవారం అర్ధరాత్రి గ్యాస్ కట్టర్ ద్వారా మణప్పురం దుకాణం గోడకు కన్నం వేసేశారు. లోపలికి వెళ్లేముందు సీసీ టీవీ కెమెరాల వైర్లను కట్ చేశారు. దీంతో సీసీటీవీ కనెక్షన్ కట్ అయింది. వీటి నిర్వహణ బాధ్యతలను చూసే కేంద్ర కార్యాలయంలోని సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు పది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పక్కనే ఉన్న శ్మశాన వాటికలోకి దూకి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

More Telugu News