Tirumala: తిరుమలలో రూములు రద్దు చేసుకున్న భక్తులు... వచ్చే వారంలోనూ ఆన్ లైన్ గదులు అందుబాటులో!

  • మూడు నెలల ముందుగానే బుక్ అయ్యే గదులు
  • ఖాళీగా ఉన్నట్టు చూపుతున్న టీటీడీ వెబ్ సైట్
  • తిరుమల గిరులను పట్టుకున్న కరోనా భయం
Rooms Available in Tirumala

ఇప్పటికే భక్తుల సంఖ్య చాలా తక్కువగా నమోదవుతున్న తిరుమల గిరులు, వచ్చే ఒకటిన్నర నెలల్లో మరింత ఖాళీగా దర్శనం ఇవ్వనున్నాయి. కరోనా వైరస్ భయాలతో, తిరుమల ప్రయాణాలు పెట్టుకున్న వేలాది మంది తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మామూలుగా అయితే, తిరుమలలో గది బుక్ చేసుకోవాలంటే, కనీసం మూడు నెలలు ముందుగానే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి వుంటుంది. దానికి తగ్గట్టుగానే భక్తులు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.

కానీ, నేడు టీటీడీ అధికారిక వెబ్ సైట్ 'టీటీడీ సేవా ఆన్ లైన్'ను పరిశీలిస్తే, ఈ నెల 17వ తేదీ నుంచి రూమ్ లు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. ముందుగా గదులను తీసుకున్న భక్తులు, వాటిని రద్దు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. వారాంతాల్లో తప్పించి, మిగతా రోజుల్లో గదుల్లో దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించడం లేదంటే, రద్దీ ఎంత తక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నేటి ఉదయం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను పరిశీలిస్తే, మార్చి 17, 18, 20, 23, 24, 26, 27, 29, 30, 31 తేదీల్లో గదులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ లో 13 రోజుల్లో గదులను బుక్ చేసుకునే అవకాశం ఉంది. మే నెలలో మాత్రం ఏ తేదీలోనైనా గదులు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. జూన్ నెల రిజర్వేషన్లు ఇటీవల ప్రారంభం కాగా, చివరి వారంలోని రెండు రోజుల్లో మాత్రమే గదులు అందుబాటులో ఉన్నాయి.

ఇక లక్కీ డిప్ లో టీటీడీ అందించే సేవా టికెట్లను మినహాయిస్తే, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ వంటి వాటికి మాత్రమే టికెట్లు మిగిలి వున్నాయి. అది కూడా జూన్ నెలలో మాత్రమే. కాగా, కరోనా వైరస్ దేశంలో మరింతగా విజృంభిస్తే లక్కీ డిప్ లో టికెట్లను కూడా భక్తులు రద్దు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News