Kuwait: కరోనా కల్లోలం.. నేటి నుంచి కువైట్‌లో అన్నీ బంద్!

  • నేటి నుంచి 26 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు బంద్
  • విమానాల రాకపోకలపై కొనసాగుతున్న నిషేధం
  • కర్ఫ్యూ కాదని వివరణ
Kuwait Announces Holidays till March 26th from today

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా వైరస్ భయంతో కువైట్ అప్రమత్తమైంది. దేశంలోకి వైరస్ చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు వారాలపాటు అంటే ఈ నెల 26 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ప్రతి ఒక్కరు దీనికి కట్టుబడి ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

అలాగే, మార్చి నెల వేతనాలను కార్మికులకు ముందస్తుగా చెల్లించాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. భారత్ సహా పలు దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించిన కువైట్.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే, విదేశాల్లో ఉన్న కువైట్ పౌరుల విషయంలో కొంత మినహాయింపు ఉంటుందని తెలిపింది.

సినిమా హాళ్లు, సమావేశ మందిరాలు, హుక్కా దుకాణాలు, విద్యాసంస్థలను ఇప్పటికే మూసివేయంతో దేశంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీంతో దేశంలో కర్ఫ్యూ విధించినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని కువైట్ స్పష్టం చేసింది.

More Telugu News