High Court: ఇష్టమొచ్చినట్టు ఫీజులు పెంచితే ఎలా?.. ప్రైవేటు స్కూళ్లపై హైకోర్టు సీరియస్​

  • చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కోర్టు
  • అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల జాబితా ఇవ్వాలని ఆదేశం
  • ఫీజులపై హైదరాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు నోటీసు
Telangana high court serious on private schools over High Tuition fees

ప్రైవేటు స్కూళ్లలో ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తే ఎలాగని తెలంగాణ హైకోర్టు మండిపడింది. ఇష్టానుసారం ఫీజులు పెంచుతున్న స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులకు సంబంధించి వేసిన కమిటీ రిపోర్టును ఏం చేశారని ప్రశ్నించింది.

ఫీజుల పెంపుపై పిటిషన్ల విచారణలో..

తెలంగాణలోని ప్రైవేటు స్కూళ్లలో ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుతున్నారని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. గతంలోనూ స్కూలు ఫీజుల నియంత్రణ కోసం తాము ఆదేశాలు ఇచ్చామని, కమిటీ వేయాలని ఆదేశించామని గుర్తు చేసింది. దీనిపై తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు కోర్టుకు అందజేయలేదని ప్రశ్నించింది.

అధిక ఫీజులపై నివేదిక ఇవ్వండి

తెలంగాణలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల జాబితాను తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫీజుల నియంత్రణపై తిరుపతి రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఫిర్యాదు వచ్చిన హైదరాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది.

More Telugu News