Hyderabad: నలుగురికీ సాయం చేసే అతని ‘ప్రయాణం' అలా ముగిసింది!

  • తమకు దారి చూపిన వ్యక్తి ఇకలేడని తెలిసి భోరుమన్న స్నేహితులు 
  • చేసేది చిరుద్యోగమే అయినా నలుగురికీ బాసట 
  • ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో శోకసంద్రం
A man died in road accident

అతనో నిరుపేద. పైగా చేసేది చిరుద్యోగం. కానీ మంచి మనసున్న మారాజు. తాను ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నా తనలా డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న వారు ఎంతో మందిని నగరానికి తెచ్చి వారికో దారి చూపించే వాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి వెన్నుతట్టి ప్రోత్సహించి వారికో మార్గం చూపేవాడు. అటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదం బారినపడి హఠాత్తుగా ఈలోకం విడిచి వెళ్లడంతో వారంతా కన్నీటి సంద్రమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువుల కంటే వారి వేదనే అధికం కావడంతో స్థానికులే ఆశ్చర్యపోయారు.

పోలీసుల కథనం మేరకు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన సుమన్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. స్నేహానికి ప్రాణమిచ్చే సుమన్ ఏడాది క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. ఓ ఫుడ్ యాప్ డెలివరీ బాయ్ గా స్థానికంగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తోంది.

ప్రస్తుతం ఆమె గర్భవతి. నగరానికి వచ్చి కాస్త కుదుట పడ్డాక సుమన్ తన స్వగ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువతకు మార్గదర్శకుడు కావాలని భావించాడు. డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వారిని హైదరాబాద్ రప్పించి వారినో ప్రైవేటు ఉద్యోగంలో చేర్చి దారి చూపిస్తుండే వాడు. ఇలా ఇప్పటికే చాలామందికి అవకాశం కల్పించాడు.

ఈ నేపథ్యంలో నిన్న మియాపూర్ లోని ఓ హోటల్ నుంచి ఆహారం తీసుకుని జాతీయ రహదారిపై జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుమన్ మృతి వార్త తెలిసి పెద్ద ఎత్తున తరలివచ్చి కంటతడి పెట్టిన అతని స్నేహితులను చూసి స్థానికులే ఆశ్చర్యపోయారు. అతని సేవా గుణమే అతన్ని ఇంతమందికి చేరువ చేసిందని వ్యాఖ్యానించారు. 

More Telugu News