Srikakulam District: మద్యం ప్రియులను దుకాణాలకు పరుగులు పెట్టించిన పుకారు.. మధ్యాహ్నానికే నో స్టాక్ బోర్డులు!

Srikakulam people queue at Liquor shops
  • రేపటి నుంచి 17 రోజులు మద్యం షాపులు మూతంటూ వార్తలు
  • శ్రీకాకుళంలో దుకాణాల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు
  • అలాంటి ఆదేశాలేవీ లేవన్న ఎక్సైజ్ అధికారులు
ఒకే ఒక్క వార్త శ్రీకాకుళం జిల్లాలోని మద్యం ప్రియులను లిక్కర్ షాపులకు పరుగులు పెట్టేలా చేసింది. దుకాణాల ముందు క్యూలో గంటల తరబడి నిలబడేలా చేసింది. మందుబాబుల క్యూలతో నిన్న జిల్లాలోని మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం చేజిక్కించుకున్న వాడు హీరోలా విజయ గర్వంతో అక్కడి నుంచి వెళ్లారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు అంటే 17 రోజులపాటు మద్యం షాపులు మూసివేస్తారన్న ప్రచారం జరిగింది. అంతే.. వార్త తెలిసిన వెంటనే మద్యం బాబులు ఎక్కడి పనులు అక్కడే ఆపేసి దుకాణాల వద్దకు పరుగులు పెట్టారు. 17 రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసుకునేందుకు పోటీలు పడ్డారు. గంటల తరబడి మద్యం షాపుల ముందు క్యూలో ఓపిగ్గా నిల్చున్నారు.

నిజానికి ఒకరికి మూడు సీసాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధన ఉండడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. కొందరు తమ బంధువులు, స్నేహితులను కూడా క్యూలలో నిలబెట్టి మరీ మద్యాన్ని సంపాదించారు. మద్యం ప్రియులు ఎగబడడంతో మధ్యాహ్నానికే చాలా షాపులు నో స్టాక్ బోర్డు తగిలించాయి. కాగా, దుకాణాల మూసివేత విషయమై అధికారుల నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Srikakulam District
Liquor shops
Local Elections
Andhra Pradesh

More Telugu News