Wuhan: కరోనాను కట్టడి చేశాం: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక ప్రకటన

Xi Jinping says coronavirus basically curbed at epicentre
  • నిన్న వూహాన్‌లో పర్యటించిన అధ్యక్షుడు
  • వూహాన్‌లో ప్రయాణ ఆంక్షలు సడలింపు
  • రోగులకు చికిత్స అందించిన చిట్టచివరి ఆసుపత్రి మూసివేత
హుబెయి ప్రావిన్స్, దాని రాజధాని వూహాన్‌లో కరోనాను కట్టడి చేయడం ద్వారా ప్రాథమికంగా విజయం సాధించినట్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వూహాన్‌లో ఆయన నిన్న పర్యటించారు. వూహాన్‌కు విమానంలో వచ్చిన జిన్ పింగ్.. ముఖానికి మాస్క్‌తో పలు ప్రాంతాల్లో పర్యటించారు.

వూహాన్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఫ్రంట్‌లైన్ మెడికల్ వర్కర్లు, రోగులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అక్కడి నుంచి హాన్‌లోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు వెళ్లి ప్రజలు, సామాజిక కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జిన్‌పింగ్.. ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరించకుండా హుబేయి ప్రావిన్స్, వూహాన్‌లో కట్టడి చేసినట్టు చెప్పారు. పరిస్థితిని అదుపు చేయడంలో, తిరిగి మునుపటి పరిస్థితులను నెలకొల్పడంలో ప్రాథమికంగా విజయం సాధించినట్టు చెప్పారు.  

అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో హుబేయి అధికారులు కీలక ప్రకటన చేశారు. వైరస్ ప్రబలిన తర్వాత వూహాన్, సెంట్రల్ హుబేయి ప్రాంతాలను దిగ్బంధించిన అధికారులు రాకపోకలను నిషేధించారు. అయితే, ఇప్పుడీ ఆంక్షలను తొలగించినట్టు పేర్కొన్నారు. గత కొన్ని రోజులు ఇక్కడ కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణ ఆంక్షలను సడలించామని, ఆరోగ్యంగా ఉన్నవారిని ముప్పు తక్కువగా ఉండే ప్రాంతాలకు అనుమతిస్తామని తెలిపారు. అలాగే, కరోనా వైరస్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన తర్వాత వూహాన్‌లోని 16 ప్రైవేటు భవనాలను ఆసుపత్రులుగా మార్చారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కో ఆసుపత్రిని మూసివేశారు. తాజాగా చిట్ట చివరిది అయిన 16వ ఆసుపత్రిని కూడా మూసివేనట్టు అధికారులు తెలిపారు.
Wuhan
China
Hubei
xi jinping
Corona Virus

More Telugu News