Alpita Chaudhari: టిక్ టాక్ వీడియో చేసి సస్పెండైన లేడీ కానిస్టేబుల్ ఇప్పుడో స్టార్!

  • లాకప్ లో టిక్ టాక్ వీడియోతో అధికారుల ఆగ్రహానికి గురైన అల్పిత
  • ఆల్బం సాంగ్స్ తో గుర్తింపు
  • స్టార్ సింగర్ గా గుజరాత్ లో సెలబ్రిటీ స్థాయి
Tik Tok cop makes it her own way as a celebrity

కొన్నాళ్ల కిందట సోషల్ మీడియాలో అల్పితా చౌదరి అనే లేడీ కానిస్టేబుల్ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది. అయితే విధి నిర్వహణలో ఆమె టిక్ టాక్ వీడియో చేసిందన్న కారణంతో డిపార్ట్ మెంట్ ఆమెను సస్పెండ్ చేసింది. ఇప్పుడా మహిళా పోలీసు గుజరాత్ లో ఓ స్టార్ సింగర్ గా పేరు తెచ్చుకుంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అల్పిత కొత్త ఆల్బం 'కచ్చి కేరి, పకీ కేరి' (పచ్చి మామిడి, పండు మామిడి) విడుదలైంది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వరకే పరిమితమైన ఆమె ఖ్యాతి ఇప్పుడు గుజరాత్ మొత్తం విస్తరించింది. ఓ ఆల్బమ్ స్టార్ గా అల్పిత సెలబ్రిటీ హోదా అందుకుంది.

అల్పిత అహ్మదాబాద్ లోక్ రక్షక్ దళ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే, మెహ్సానా జిల్లా లంఘ్ నాజ్ పోలీస్ స్టేషన్ లాకప్ లో ఆమె టిక్ టాక్ వీడియో చేయడం అధికారుల ఆగ్రహానికి గురైంది. దాంతో కొన్నాళ్లపాటు సస్పెండ్ చేశారు. మళ్లీ విధుల్లో చేరినా పాటలు పాడడం మాత్రం ఆపలేదు. టిక్ టాక్ ని దీవానా అనే ఆల్బంతో సంగీత రంగంలో ప్రవేశించింది. గుజరాతీ జానపద గాయకుడు జిఘ్నేశ్ కవిరాజ్ తో కలిసి అల్పిత పాడిన పాటలకు ప్రజాదరణ లభించింది. ఆ తర్వాత రెండు భక్తిగీతాల ఆల్బంలు చేసింది. తాజాగా గుజరాతీ నటుడు ధవళ్ బారోట్ తో కలిసి చేసిన 'కచ్చి కేరి, పకీ కేరి' ఆల్బంలో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది.

కాగా, సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని, అయితే లాంగ్ లీవ్ పెట్టేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అల్పిత తండ్రి కూడా ఓ పోలీసు అధికారి. నటి, గాయని, మోడల్ కావాలన్నది అల్పిత కల. తండ్రి బాటలో పోలీసు అయినా, గాయనిగానూ సత్తా చాటుతోంది.

More Telugu News