Congress: సోనియాను కలిసేందుకు వచ్చిన సింధియా.. అపాయింట్‌మెంట్ ఇవ్వని మేడమ్!

  • మధ్యప్రదేశ్ సంక్షోభానికి సింధియానే కారణమని భావన
  • కలిసేందుకు సోనియా విముఖత
  • ప్రస్తుత పరిస్థితిని ముందే ఊహించిన కాంగ్రెస్
Jyotiraditya Scindia did not get appointment of Sonia Gandhi

తనను కలిసేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మధ్యప్రదేశ్‌ సంక్షోభం నేపథ్యంలో సోనియాను కలిసి అన్ని విషయాలు వివరించాలనుకున్న ఆయనకు సోనియా ఆ అవకాశం ఇవ్వలేదు. నిజానికి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారు ఇబ్బందుల్లో పడడానికి సింధియానే కారణమన్న ఉద్దేశంతోనే అపాయింట్‌మెంట్ నిరాకరించినట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సింధియా ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. అయితే, సీనియర్ నేత అన్న ఉద్దేశంతో కమల్‌నాథ్‌కు అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా, తన మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలతో సింధియా అదృశ్యం కావడం సంచలనమైంది. ఆయన బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అదే నిజమైతే, సింధియా మద్దతుదారులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి అయిన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాబోతోందని కాంగ్రెస్ ముందుగానే ఊహించినట్టు ఇటీవల ఆ పార్టీ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కమల్‌నాథ్ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు, రాష్ట్రంలో ప్రస్తుత సంక్షోభానికి సింధియానే కారణమన్న ఉద్దేశంతోనే ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సోనియా నిరాకరించారని తెలుస్తోంది.

More Telugu News