వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి డొక్కా​: అంబటి రాంబాబు

09-03-2020 Mon 17:20
  • వైసీపీలో డొక్కా చేరిక శుభపరిణామం
  • నీతినిజాయతీలకు మారుపేరు డొక్కా
  • అనివార్య కారణాల వల్ల వైసీపీలో గతంలోనే చేరలేకపోయారన్న అంబటి
Amabati says Dokka has friendly relations with YS family

గుంటూరు జిల్లా నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తమ పార్టీలో చేరడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైసీపీలో డొక్కా చేరికను శుభపరిణామంగా భావిస్తున్నామని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో డొక్కాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వైఎస్ హయాంలో పలు శాఖల్లో ఆయన కీలక పదవులు నిర్వహించారని గుర్తుచేశారు.

సీఎం జగన్ సమక్షంలో ఆయన తమ పార్టీలో చేరారని అన్నారు. గతంలోనే ఆయన తమ పార్టీలో చేరాల్సి ఉందని, అయితే, అనివార్య కారణాల వల్ల చేరలేకపోయారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి, నీతి నిజాయతీలకు మారుపేరైన డొక్కా.. వైసీపీలో చేరడం తమ పార్టీకి కొంత మేరకు బలాన్ని చేకూరుస్తుందని అంబటి భావించారు.