Shafali Verma: పాపం షెఫాలీ వర్మ.. ఆరు రోజుల్లోనే నంబర్ వన్ ర్యాంక్‌ ఔట్

Shafali Verma loses top spot in ICC T20I player rankings with in six days
  • తాజా ర్యాంకింగ్స్‌లో మూడో ప్లేస్‌కు పడిపోయిన యువ క్రికెటర్‌‌ 
  • ఫైనల్లో రెండు పరుగులే చేసిన షెఫాలీ
  • ఆసీస్ ఓపెనర్‌‌ బెత్‌ మూనీకి అగ్రస్థానం
భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ సెన్సేషన్‌ షెఫాలీ వర్మకు నిరాశ ఎదురైంది. టీ20 మహిళల బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె ప్రపంచ నంబర్‌‌ వన్‌ ర్యాంకింగ్‌ ఆరు రోజుల ముచ్చటే అయింది. సోమవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో షెఫాలీ అగ్రస్థానం కోల్పోయింది. రెండు ర్యాంకులు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయింది.

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శన చేసిన షెఫాలీ గత బుధవారమే నంబర్‌‌ వన్‌ ర్యాంక్ సాధించింది. కానీ, ఫైనల్లో కేవలం రెండు పరుగులకే ఔటవడం షెఫాలీ ర్యాంక్‌ను దెబ్బతీసింది. 744 రేటింగ్‌ పాయింట్లతో ఆమె ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఫైనల్లో టాప్‌ స్కోరర్‌‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఓపెనర్‌‌ బెత్‌ మూనీ 762 పాయింట్లతో మూడు నుంచి ఒకటో ర్యాంక్‌కు దూసుకొచ్చింది. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా మూనీ తన కెరీర్‌‌లో తొలిసారి నంబర్‌‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది. న్యూజిలాండ్‌ క్రికెటర్ సుజీ బేట్స్ (750) రెండో ర్యాంక్‌లో మార్పులేదు.

టాప్‌–10లో మంధాన, జెమీమా 

భారత క్రికెటర్లు స్మృతి మంధా, జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌–10లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచకప్‌లో నిరాశ పరిచిన మంధాన ఆరు నుంచి ఏడో ప్లేస్‌కు పడిపోగా, జెమీమా రోడ్రిగ్స్‌ తొమ్మిదో స్థానంలో మార్పు లేదు. భారత ఆల్‌రౌండర్‌‌ దీప్తి శర్మ బ్యాటింగ్‌ విభాగంలో ఏకంగా పది స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌ అందుకోగా, ఆల్‌రౌండర్ల విభాగంలో తొలిసారి టాప్‌–5లోకి వచ్చింది. ఇక, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌ వరుసగా 6,7,8 స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌ బౌలర్‌‌ సోఫీ ఎకిల్‌స్టోన్‌ టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకుంది.
Shafali Verma
ICC T20I player rankings
loses top spot
T20 World Cup

More Telugu News