Corona Virus: 43కు పెరిగిన కరోనా కేసులు... కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన!

  • జమ్మూ కశ్మీర్ లో నమోదైన తొలి కేసు
  • ఢిల్లీ, యూపీల్లో ఇద్దరు కరోనా పాజిటివ్
  • చిన్నారుల స్కూళ్లకు సెలవులు ప్రకటించిన కర్ణాటక
  • 52 ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయన్న కేంద్రం
Corona Virus Expands to 43 People in India

100కు పైగా దేశాలకు విస్తరించి, దాదాపు 4 వేల మందిని పొట్టన బెట్టుకున్న ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇండియాలో 43కు పెరిగింది. తాజాగా జమ్ము కశ్మీర్ లో తొలి కేసు నమోదైందని, 63 ఏళ్ల మహిళకు వైరస్ పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. ఢిల్లీ, యూపీల్లోనూ రెండు కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

ఇరాన్ నుంచి వచ్చిన జమ్మూ మహిళకు వ్యాధి నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆమెకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్సను అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. కాగా, నిన్న కేరళకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురికి వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరి వయసు 90 సంవత్సరాలు దాటి వుండటంతో, వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

ఇదిలావుండగా, బెంగళూరులోని కిండర్ గార్టెన్ స్కూళ్లన్నీ ముందు జాగ్రత్త చర్యగా మూసివేయాలని యడియూరప్ప సర్కారు ఆదేశించింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వైరస్ సోకిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఇక విదేశాల నుంచి వచ్చే ఏ నౌకకూ భారత నౌకాశ్రయాల్లో లంగర్ వేసేందుకు అవకాశం ఇవ్వరాదని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 3కు ముందు ఇటలీ, ఇరాన్, సౌత్ కొరియా, జపాన్ తదితర దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారికి ఇచ్చిన ఈ-వీసాలన్నీ ఇప్పటికే రద్దయిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం మీద వైరస్ పరీక్షల నిమిత్తం 52 అత్యాధునిక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 57 ల్యాబొరేటరీలకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది.

More Telugu News