Amrutha: మా నాన్నను చివరి సారి చూస్తాను... రక్షణ కావాలని పోలీసులను కోరిన అమృత!

Amrutha Wants to see Fathers Dead Body
  • నిన్న హైదరాబాద్ లో మారుతీరావు ఆత్మహత్య
  • అమృత వచ్చేందుకు అంగీకరించని బాబాయ్
  • అంత్యక్రియలకు వస్తానంటున్న అమృత
తను తన తండ్రిని కడసారిగా చూడాలని అనుకుంటున్నానని, అందుకు పోలీసుల సహకారం కావాలని నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు కుమార్తె అమృత కోరింది. ఈ మేరకు ఆమె మిర్యాలగూడ అధికారులకు సమాచారాన్ని పంపింది. తన తండ్రిని చూడాలని భావిస్తున్నానని, అక్కడికి వెళితే, తనపై దాడి జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని ఆమె కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమృత రావాలని అనుకుంటున్న విషయాన్ని మారుతీరావు దగ్గరి బంధువులకు తెలియజేస్తామని, వారి అభిప్రాయం తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.

తన తండ్రి అంత్యక్రియలకు వస్తానని అమృత చేసిన విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఆమె తల్లి స్పందించలేదని తెలుస్తోంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న ఆగ్రహంతో ఆమె ఉన్నట్టు కొందరు బంధువులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమృత వచ్చేందుకు ఆమె బాబాయ్ నిరాకరించాడని సమాచారం. ఆమె వస్తే, తన సోదరుడి ఆత్మ శాంతించబోదని ఆయన అన్నట్టు తెలుస్తోంది.

కాగా, అమృత ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, ఆమె భర్త ప్రణయ్ ని 2018లో మారుతీ రావు దారుణంగా హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు, హైదరాబాద్ లోని, వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఆయన బస చేసిన గదిలో విషపు బాటిల్ కనిపించకపోవడంతోనే అనుమానాస్పద కేసుగా భావించి, విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. మారుతీరావు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం జరుగనున్నాయి. 
Amrutha
Maruti Rao
Miryalaguda
Police

More Telugu News