Traffic: చలాన్లు తప్పించుకునేందుకు బైకర్ ప్లాన్... విస్తుపోయిన పోలీసులు!

  • రామగుండం పరిధిలో జరిమానా
  • హైదరాబాద్ లోని వ్యక్తికి జరిమానా
  • అసలు నిందితుడిని ట్రేస్ చేసిన పోలీసులు
Biker Changed Number of Vehicle to escape Challans

హెల్మెట్ లేకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సిగ్నల్ జంప్ చేసినా, మరే ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, పోలీసులు ఫొటోలు తీసి, చలాన్లు పంపిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, వీటిని తప్పించుకునేందుకు ఓ బైకర్ మహా ప్లాన్ వేశాడు. దీంతో పోలీసులు కూడా అవాక్కై, అతన్ని గుర్తించేందుకు నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది.

ఆ వివరాల్లోకి వెళితే, రామగుండం సమీపంలోని పాలకుర్తిలో నిబంధనలకు విరుద్ధంగా బైక్ పై వెళుతున్న వ్యక్తి చిత్రాన్ని తీసిన పోలీసులు, దాన్ని అప్ లోడ్ చేశారు. వెంటనే ఆ బైక్ యజమానికి చెందిన సెల్ ఫోన్ నంబర్ కు మెసేజ్ వెళ్లింది. దీంతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి లబోదిబోమన్నాడు. తన బైక్ అసలు రామగుండం వెళ్లలేదని వాపోతూ, సంబంధిత పోలీసు స్టేషన్ కు ఫోన్ చేశాడు.

దీంతో పోలీసులు మరోసారి వాహనం నంబర్ ను సరిచూసుకుని, వాహన వివరాలు సరైనవేనని తేల్చారు. అసలు తాను, తన బైక్, రామగుండం పరిధిలోకే వెళ్లకుంటే, తనపై జరిమానా ఎలా విధిస్తారంటూ, అతను, కమిషనరేట్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి పోలీసులు తాము ఎంట్రీ చేసిన వివరాలు పరిశీలించి, అంతా సక్రమంగానే ఉన్నాయని చెప్పారు.

ఆపై తన బైక్ నంబర్ ను మరో యువకుడు వాడుతున్నాడని బాధితుడు చెప్పడంతో, జరిమానా విధించబడిన వాహనదారుడిని రామగుండం పోలీసులు ట్రేస్ చేశారు. అతన్ని విచారించగా, తన బైక్‌కు నంబర్‌ లేదని, ఫ్యాన్సీగా ఉంటుందని భావించి, మరో  నంబర్‌ ను తగిలించుకుని గత మూడేళ్లుగా తిరుగుతున్నానని చెప్పడంతో అవాక్కయ్యారు. వాహనానికి తగిలించిన తప్పుడు నంబర్‌ ప్లేటును తొలగించి, అతనితో జరిమానా కట్టించారు.

More Telugu News