Telangana: ఆ నిధులు జీతాలకే సరిపోవు: బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు

Allocations to the Department of Education are not just for salaries says BJP MLC
  • విద్యా రంగంపై సర్కారు నిర్లక్ష్యం
  • ‌ ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఇచ్చిన నిధులు బకాయిలకే చాలవు
  • ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్
తెలంగాణ బడ్జెట్ లో విద్యా రంగంపై తీవ్రంగా నిర్లక్ష్యం చూపారని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ఇది పూర్తిగా నిరాశాజనక బడ్జెట్ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఎవరికీ కూడా ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఈ బడ్జెట్  తీరును తప్పుపడుతోందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో మాయ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ కు నిధులేవి?

విద్యా రంగానికి అరకొర కేటాయింపులే చేశారని, దానికి చేసిన కేటాయింపులు టీచర్ల జీతాలకే సరిపోవని రాంచందర్ రావు మండిపడ్డారు. కొత్త భవనాలు నిర్మించడానికి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించడానికి నిధులు ఏవని నిలదీశారు. విద్యా రంగానికి బడ్జెట్ ను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్ మెంట్  కింద ఇప్పటికే కాలేజీలకు రూ.6 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం రూ. 2,600 కోట్లే  కేటాయించిందన్నారు. మరి ఎందరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తారు, ఎంత మందికి ఇవ్వరో తెలియడం లేదన్నారు.

మధ్యంతర భృతి అయినా ఇవ్వాలి

ఉద్యోగులకు సంబంధించి కూడా బడ్జెట్ లో ఎలాంటి ఉపశమనం లేదని రాంచందర్రావు మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంలో జాప్యం చేశారని, కనీసం వారికి మధ్యంతర భృతి ఇచ్చే ప్రతిపాదనగానీ, అందుకు సరిపడా కేటాయింపులుగానీ చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, కనీసం వారికి నిరుద్యోగ భృతి కూడా అందించడం లేదని విమర్శించారు.

మహబూబ్ నగర్, నల్లగొండలను పట్టించుకోరా?

స్మార్ట్ సిటీల కింద కరీంనగర్, వరంగల్ లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, వాటికే నిధులు కేటాయించారని రాంచందర్ రావు అన్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ పట్టణాలను పట్టించుకోవడం లేదేమని ప్రశ్నించారు. వాటికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Telangana
Telangana Assembly
Telangana Budget
BJP

More Telugu News