Telangana: ఇది తిరోగమన బడ్జెట్​.. విద్యార్థులు, ఉద్యోగులకు నిరాశే: కాంగ్రెస్​ నేత జీవన్​ రెడ్డి

This is a regressive budget Congress MLC Jeevanreddy fire on TRS government
  • ఫీజు రీయింబర్స్ మెంట్ కేటాయింపులు బకాయిలకే సరిపోవు
  • యువతను టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తోంది
  • విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారని వ్యాఖ్య
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది తిరోగమన బడ్జెట్ అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యార్థులు, ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.

విద్యార్థులను నిరాశకు గురిచేశారు

క్రమంగా విద్యా బడ్జెట్ కుదింపు ప్రభుత్వ తిరోగమన చర్యకు అద్దం పడుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. ‘‘విద్యార్థులకు కల్పించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి కేవలం రూ.2,650 కోట్లు కేటాయించారు. ఆ సొమ్ము ఇప్పుడున్న బకాయిలకే సరిపోదు. విద్యార్థులను నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నారు.” అని చెప్పారు. తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని భావించామని.. కొత్త ఉద్యోగాల కల్పన దేవుడికే తెలుసుగానీ.. ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టడమే లేదని విమర్శించారు.

నిరుద్యోగులను మోసం చేశారు

ఎలక్షన్ల ముందు నిరుద్యోగులకు నెలనెలా భృతి ఇస్తామని వాగ్దానం చేశారని, ఇవ్వకుండా మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. గత బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 1,820 కోట్లు కేటాయించారని.. కానీ ఆ పథకమే అమలు చేయలేదని గుర్తు చేశారు. అసలే ఉపాధి అవకాశాలు లేవని, ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా అమల్లోకి రాకపోవడంతో యువత ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

ఏపీలో మధ్యంతర భృతి ఇచ్చారు.. ఇక్కడ ఇవ్వలేదేం?

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాల పెంపు ఏదని జీవన్ రెడ్డి నిలదీశారు. పీఆర్సీ వేసి ఇన్నేళ్లయినా అమలు చేయడం లేదని, కనీసం మధ్యంతర భృతి అయినా ఇవ్వలేదని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారని.. ఇక్కడ ఇవ్వడానికి ఏమైందని నిలదీశారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకొని.. వారిని తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నారని విమర్శించారు.
Telangana
Telangana Budget
Telangana assembly
Harish Rao
Jeevan Reddy

More Telugu News