Telangana: తెలంగాణ బడ్జెట్​: రైతులకే నేరుగా రుణ మాఫీ సొమ్ము చెక్కులు

  • 25 వేల లోపు రుణాలున్న వారికి ఒకే దఫాలో మాఫీ
  • అంతకన్నా ఎక్కువగా ఉన్న వారికి దశల వారీగా సొమ్ము
  • ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే ‘రైతు బంధు’ పథకానికి రూ.14 వేల కోట్లు కేటాయింపు
Crop Loan waiver scheme checks will be distributed by MLAs

రైతులకు రుణ మాఫీ విషయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణాలకు సంబంధించిన సొమ్మును నేరుగా బ్యాంకులకు చెల్లించకుండా రైతులకే చెక్కుల రూపంలో అందజేయాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం వెల్లడించారు.

ఎమ్మెల్యేల చేతుల మీదుగా రైతులకు చెక్కులు

రైతుల రుణ మాఫీ కోసం బడ్జెట్ లో రూ.6,225 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది ఉన్నారని, వారందరికీ పూర్తి సొమ్మును ఒకేసారి అందజేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఈ నెలలోనే రూ.1,198 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మిగతా వారికి దశల వారీగా రుణ మాఫీ చెక్కులు అందజేస్తామన్నారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా రైతులకు చెక్కుల పంపిణీ ఉంటుందని వెల్లడించారు.

భూములున్న అందరికీ నిధులు అందేలా..

వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా ‘రైతు బంధు’ పథకానికి నిధులు కేటాయించామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నామని చెప్పారు. గత బడ్జెట్ లో రైతు బంధు పథకానికి రూ.12 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈసారి పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా మరో రెండు వేల కోట్లు అదనంగా చేర్చి రూ.14 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

More Telugu News