Kerala: ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారికి కేరళ సర్కారు ‘సేఫ్ హోమ్స్’

  • కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణగా నిలిచే ఉద్దేశం
  • ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మించాలని నిర్ణయం
  • అందులో ఏడాది పాటు ఉచితంగా ఉండేందుకు అవకాశం
kerala to open safe homes for inter caste inter faith couples

పెద్దలను ఎదిరించి కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు, వారు కొంతకాలం భద్రంగా నివసించేందుకు ప్రత్యేకంగా ‘సేఫ్ హోమ్స్’ నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో సేఫ్ హోమ్స్ ను నిర్మించనున్నామని, ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని కేరళ సామాజిక న్యాయ శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.

ఇప్పటికే కొన్ని రకాల సాయం అందిస్తున్నాం

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ఇప్పటికే పలు రకాలుగా సాయం అందిస్తున్నామని మంత్రి శైలజ చెప్పారు. ఏడాదికి రూ.లక్ష లోపు ఆదాయం ఉన్న జంటలకు స్వయం ఉపాధి కింద రూ.30 వేలు ఇస్తున్నామని, అదే ఎస్సీ వర్గానికి చెందిన వారైతే రూ.75 వేలు సాయం అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల బదిలీ విషయంలో ఆ జంటలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించనున్నామని వెల్లడించారు. అయితే వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు.

ఏడాది పాటు ఉండొచ్చు

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారు సామాజిక న్యాయ శాఖ నిర్మించే ‘సేఫ్ హోమ్స్’లో ఏడాది పాటు ఉండొచ్చని మంత్రి శైలజ తెలిపారు. అలాంటి వారిని వారి సొంత కుటుంబాలు సైతం దూరం పెడుతున్నాయని, కొన్నిసార్లు దాడులకూ దిగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారికి రక్షణ కల్పించడంతోపాటు కొంతకాలం ఉపాధి, ఇతర సహాయం అందజేసే చర్యలు చేపట్టామని వివరించారు.

భిన్నాభిప్రాయాలెన్నో..

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వారి కోసం ‘సేఫ్​ హోమ్స్​’ నిర్మించాలన్న కేరళ సర్కారు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మంచి నిర్ణయమని సంస్కరణ వాదులు, మేధావులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ‘లవ్​ జిహాద్​’ కోసమే కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ, అనుబంధ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కొందరు హిందూ యువతులకు ఎరవేసి మతం మార్చుతున్నారని, వారికి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని మండిపడుతున్నాయి.

More Telugu News