Corona Virus: మరో ముగ్గురికి కరోనా.. భారత్ లో 34కు చేరిన వైరస్ బాధితుల సంఖ్య

  • లడఖ్ లో ఇద్దరికి, తమిళనాడులో ఒకరికి వైరస్ పాజిటివ్
  • ముగ్గురూ విదేశాలకు వెళ్లి వచ్చినట్టు గుర్తింపు
  • జమ్మూకశ్మీర్ లోని పలు జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలు బంద్
  • దేశవ్యాప్తంగా 52 ల్యాబ్ లు.. మరో 57 శాంపిల్ కలెక్షన్ సెంటర్లు
3 New Coronavirus Cases Takes Total To 34 in India

దేశంలో మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. అందులో కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో ఇద్దరికి, తమిళనాడులో ఒకరికి వైరస్ పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం ప్రకటించింది. శుక్రవారం రాత్రి వరకు 31 కరోనా కేసులు నమోదుకాగా.. తాజాగా నమోదైన వాటితో కలిపి మొత్తం 34కు చేరినట్టు తెలిపింది.

ముగ్గురూ విదేశాలకు వెళ్లి వచ్చినవారే..

తాజాగా వైరస్ సోకిన ముగ్గురూ కూడా ఇటీవలి కాలంలోనే విదేశాలకు వెళ్లి వచ్చినట్టుగా గుర్తించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లడఖ్ కు చెందిన ఇద్దరు ఇరాన్ కు వెళ్లి వచ్చారని.. తమిళనాడుకు చెందిన వ్యక్తి ఒమన్ దేశానికి వెళ్లి వచ్చారని ప్రకటించింది. ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.

జమ్మూ కశ్మీర్ లో పాఠశాలలు బంద్

లడఖ్ లో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో జమ్మూ కశ్మీర్ లోని పలు జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబాలు, వారితో కాంటాక్ట్ లో ఉన్న వారిని ఇండ్లలోనే ఐసోలేషన్ చేశారు.

మరిన్ని అనుమానిత కేసులు

విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిశీలన ముమ్మరం చేసింది. పంజాబ్ లోని హోషియార్ పూర్ లో ఇటీవలే ఇటలీ వెళ్లివచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో అమృత్ సర్ లోని హాస్పిటల్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

టెస్టుల కోసం 52 ల్యాబ్ లు.. మరో 57 శాంపిల్ కలెక్షన్ సెంటర్లు

కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వైద్య పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 52 ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దానితోపాటు 57 చోట్ల కరోనా వైరస్ అనుమానిత కేసుల శాంపిళ్లను సేకరించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.

More Telugu News