Nara Lokesh: అశోక్ గారిని ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడడం జగన్ ప్రభుత్వ అధికార మదానికి నిదర్శనం: నారా లోకేశ్

Nara Lokesh supports Ashok Gajapathi Raju over Mansas Trust issue
  • మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై స్పందించిన టీడీపీ హైకమాండ్
  • అశోక్ గజపతిరాజుకు మద్దతుగా నిలిచిన నారా లోకేశ్
  • వైసీపీ నేతలు సూర్యుడిపై ఉమ్మి వేయాలనుకుంటున్నారని వ్యాఖ్యలు
  • అశోక్ గారిపై అవినీతి ముద్ర వేయడానికి మనసెలా వచ్చిందంటూ ఆగ్రహం
మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు పార్టీ హైకమాండ్ మద్దతుగా నిలిచింది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఘాటుగా స్పందించారు.

అశోక్ గజపతిరాజు వంటి గొప్ప వ్యక్తిపై అవినీతి ముద్ర వేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయాలనుకోవడమేనని ట్వీట్ చేశారు. అశోక్ గారిని ఏకవచనంతో సంబోధిస్తూ, కనీస అవగాహన లేకుండా మంత్రి మాట్లాడడం జగన్ ప్రభుత్వ అధికార మదానికి నిదర్శనమని విమర్శించారు.

వేల ఎకరాల భూమిని, సంపదను మాన్సాస్ ట్రస్టుకు ఇవ్వడంతోపాటు, ఉత్తరాంధ్రలో వేలమంది విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన అశోక్ గారిపై అవినీతి ముద్ర వేయడానికి మీకు మనస్సు ఎలా వచ్చింది జగన్ గారూ? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. "చీకటి జీవో ఇచ్చి మాన్సాస్ ట్రస్టులో రాజకీయ క్రీడ మొదలుపెట్టారు. ఉత్తరాంధ్రలో మొదలైన వైసీపీ విధ్వంసకాండను సింహాచలం అప్పన్న చూస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh
Ashok Gajapathi Raju
Mansas Trust
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News