Hyderabad: రుణాలిప్పిస్తామంటూ రూ.10 కోట్ల వసూలు.. ఇద్దరి అరెస్టు!

  • నమ్మకమైన మాటలే వారి పెట్టుబడి 
  • ఏజెంట్లను నియమించుకుని వసూళ్లు 
  • బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు చిక్కిన వైనం
Two cheaters arrest

ఆరేళ్లపాటు వారి ఆటలు సాగాయి. పావలా వడ్డీకే రుణాలంటూ మురికివాడల్లో ప్రజల్ని మాయచేసి వారి వద్ద నుంచి లబ్దిదారుల వాటా పేరుతో రూ.పది కోట్ల వరకు వసూలుచేసి మోసం చేసిన ఇద్దరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాల్లోకి వెళితే...సికింద్రాబాద్ లోని ఆర్కే పురంలో నివసించే పద్మావతి పదేళ్ల క్రితం ఓ కార్పొరేట్ సంస్థ సూక్ష్మరుణాల విభాగం అధికారులను పరిచయం చేసుకుంది. వారి సాయంతో మురికివాడల్లోని ప్రజలకు పావలావడ్డీకే రుణాలు ఇప్పించడం మొదలు పెట్టింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, మల్కాజ్ గిరి, నేరేడ్మెట్ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పావలావడ్డీకి రుణాలు ఇప్పించింది.

2014లో సదరు కార్పొరేట్ సంస్థ రుణాలు ఇవ్వడం నిలిపివేయడంతో 'వనితా మైక్రోఫైనాన్స్' పేరుతో ఓ సంస్థను ప్రారంభించి తానే రుణాలు ఇస్తానని ప్రచారం చేసుకుంది. ఇందుకోసం పోస్టల్ శాఖలో పనిచేసే విష్ణుప్రసాద్ సాయం తీసుకుంది. వందలాది మంది ఏజెంట్లను నియమించుకుంది. ఈ విధంగా ఔత్సాహికుల నుంచి లబ్దిదారుల వాటాగా రూ.10 కోట్లు వసూలు చేసింది.

ఈ నిధులతో పద్మావతి, విష్ణు ప్రసాద్ లు జల్సాలు చేసేవారు. దరఖాస్తుదారులు రుణాల గురించి ప్రస్తావించినప్పుడల్లా చెన్నై నుంచి డబ్బు వస్తోందంటూ మాయమాటలతో కాలక్షేపం చేసేవారు. ఎప్పటికీ వారి మాటలు నిజం కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

More Telugu News