Ashok Gajapathi Raju: మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా సంచయితను నియమించడంపై అశోక్ గజపతిరాజు స్పందన

  • ట్రస్ట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదు
  • వంశపారంపర్య పదవులు, ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయవద్దు
  • 105 ఆలయాల భూములపై వైసీపీ ప్రభుత్వం కన్ను వేసింది
Ashok Gajapathi Raju fires on YSRCP government

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తనను తొలగించి ఆ స్థానంలో తన అన్న కుమార్తె సంచయితను నియమించడంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా వింతగా ఉందని చెప్పారు. ట్రస్ట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని అన్నారు. వంశపారంపర్య పదవులు, ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయవద్దని సూచించారు. ట్రస్టులో అన్యమతస్తుల జోక్యం సరి కాదని చెప్పారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాలతో సంబంధం లేని దేవాలయ ట్రస్టుకు రాజకీయాలను ఆపాదించడం ఈ దేశానికే అరిష్టమని అశోక్ గజపతిరాజు అన్నారు. తనను ట్రస్ట్ చైర్మన్ గా తొలగించే ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జీవో కాపీ అందిన తర్వాత తాము కోర్టును ఆశ్రయించాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఎలా పోరాడాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మాన్సాస్ ట్రస్టును నిర్వీర్యం చేయడానికి దేవాదాయ అధికారులతో కలిసి కొన్నాళ్లుగా కుట్రలు చేశారని అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని... వీటి భూములపై ప్రభుత్వం కన్ను వేసిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పటికే పరిశ్రమలు, పెట్టుబడిదారులు వెళ్లిపోయారని అన్నారు.

More Telugu News