Arthur: సీఎం జగన్ నిర్ణయాలే మాకు శిరోధార్యం: వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

  • పార్టీ వీడతారంటూ ఎమ్మెల్యే ఆర్ధర్ పై ప్రచారం
  • ఎమ్మెల్యే ప్రెస్ మీట్ తో ఆ ప్రచారం వట్టిదేనని తేలిన వైనం
  • ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న నందికొట్కూరు ఎమ్మెల్యే
YSRCP MLA Arthur says they are loyal to YS Jagan

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ పేరు కొంతకాలంగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతర వైసీపీ నేతలతో ఆర్థర్ కు పొసగడంలేదని, యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఓ దశలో ఆర్ధర్ పార్టీని వీడొచ్చని కూడా ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే ఆర్ధర్ స్వయంగా వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా తమకు సీఎం జగన్ నిర్ణయాలే శిరోధార్యమని స్పష్టం చేశారు.

నందికొట్కూరు మార్కెట్ కమిటీ పదవులు తమకు రానందుకు బాధపడడంలేదని తెలిపారు. మొదట్లో కొద్దిగా మనస్తాపానికి గురైన మాట వాస్తవమేనని, అయితే పదవులు అందరికీ ఇవ్వలేరన్న విషయం కార్యకర్తలకు సర్దిచెప్పానని వెల్లడించారు. మంత్రి అనిల్ కుమార్ ను జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని అన్నది తమ అనుచరులు కాదని, వాళ్లు బయటి వ్యక్తులని ఆర్ధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితోనూ తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని అన్నారు.

నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకపోవడం చాలా బాధ కలిగించిందని, సమాచారం ఇవ్వని అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలిచి సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని ఆర్ధర్ ఉద్ఘాటించారు.

More Telugu News