Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో మూడు రోజులుగా జాడలేని కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • మధ్యప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం
  • 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందన్న కాంగ్రెస్
  • ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగమేనని ఆరోపణ
Madhyapradesh Congress MLA Missing from last four days

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిసహులాల్ సింగ్ అదృశ్యం కలకలం రేపుతోంది. ఈ నెల 2న ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో ఆయన కుమారుడు టీటీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2 నుంచి ఆయన కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందంటూ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కనిపించకుండా పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రాలు భారీగా డబ్బు ఆశ చూపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 35 కోట్ల వరకు ఆశ చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, తమ ఎమ్మెల్యేలు 14 మందిని బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. అంతేకాదు, నలుగురు ఎమ్మెల్యేలను చార్టర్డ్ విమానంలో బెంగళూరుకు తరలించేందుకు బీజేపీ ప్రయత్నించిందని, దీనిపై విచారణ జరపాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు.

More Telugu News