Hyderabad: మామ లైంగిక వేధింపులు భరించలేక.. కోడలి ఆత్మహత్య

Daughter in law committed Suicide after father in law sexually harassment
  • ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం
  • పెద్దలు మందలించినా మారని మామ బుద్ధి
  • ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉసురు తీసుకున్న కోడలు
మామ పెట్టే లైంగిక వేధింపులు భరించలేని కోడలు ఉరివేసుకుని ఉసురు తీసుకుంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ  ఘటన. బషీర్‌బాగ్‌లోని పూల్‌బాగ్‌కు చెందిన మహిళ (25) ఏడాదిన్నర క్రితం గాంధీనగర్‌కు చెందిన రమేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. రమేశ్ తండ్రి వెంకటేశ్ (50) గత కొంతకాలంగా కోడలిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు అతడితో మాట్లాడి తండ్రిలాంటి వాడికి ఇలాంటి పనులు తగవని మందలించారు.

రమేశ్ మొన్న భార్య, కుమార్తెతో కలిసి జేఎన్ఎన్‌యూఆర్ఎం గృహ సముదాయంలో ఉంటున్న అత్తవారింటికి వెళ్లి వారిని వదిలిపెట్టాడు. నిన్న మధ్యాహ్నం బాధిత మహిళ అదే అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో నివసిస్తున్న అన్న ఇంటికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు తలుపులు గడియపెట్టి ఉండడం గమనించారు. తట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. ఓ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రమేశ్ తండ్రి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Crime News
saifabad
Telangana

More Telugu News