T20 World Cup: మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా... సెమీస్ లో దక్షిణాఫ్రికాకు నిరాశ

  • మహిళల టి20 వరల్డ్ కప్ సెమీస్ లో సఫారీలపై ఆసీస్ విజయం
  • మొదట 5 వికెట్లకు 134 పరుగులు చేసిన ఆసీస్
  • ఛేదనలో వర్షం అడ్డంకి
  • డక్ వర్త్ లూయిస్ విధానంలో సఫారీల లక్ష్యం 13 ఓవర్లలో 98గా కుదింపు
  • 5 వికెట్లకు 92 పరుగులు చేసి ఓటమిపాలైన దక్షిణాఫ్రికా
  • ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్
Host Australia rams into Women T20 World Cup Final

వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా వంటి దురదృష్టకరమైన జట్టు మరొకటి లేదని చెప్పాలి! పురుషుల వరల్డ్ కప్ టోర్నీల్లో సఫారీలు అనేకసార్లు అదృష్టం ముఖం చాటేయడంతో వెనుదిరిగారు. వరుణుడు వారికి అనేకమార్లు అడ్డుతగిలి టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పుడు మహిళల విషయంలోనూ అదే కథ! తాజాగా, ఆస్ట్రేలియాతో జరిగిన టి20 వరల్డ్ కప్ సెమీస్ లో దక్షిణాఫ్రికా అత్యంత బాధాకర పరిస్థితుల్లో ఓటమిపాలైంది.

సిడ్నీలో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో మొదట ఆతిథ్య ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. అయితే, దక్షిణాఫ్రికా లక్ష్యఛేదన సమయంలో వర్షం పడడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్ ను కుదించారు. దాంతో సఫారీ అమ్మాయిలు 13 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ ఆ జట్టు 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేయడంతో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో విజయంతో ఆస్ట్రేలియా టోర్నీ ఫైనల్ చేరింది.

భారత్ అమ్మాయిలు ఇప్పటికే ఫైనల్ చేరిన నేపథ్యంలో ఆస్ట్రేలియా వంటి కఠిన ప్రత్యర్థితో టైటిల్ సమరంలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. టీమిండియా, ఆసీస్ మధ్య ఆదివారం టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, లీగ్ దశలో ఆసీస్ ను చిత్తు చేయడం భారత అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

More Telugu News