Tammareddy: హైదరాబాద్​ నుంచి సినీ పరిశ్రమ తరలివెళ్లాల్సిన అవసరం లేదు: తమ్మారెడ్డి భరద్వాజ

  • హైదరాబాద్ నుంచి విశాఖకు ఎందుకు షిఫ్ట్ అవ్వాలి?
  • తెలంగాణ, ఆంధ్రా రెండూ తెలుగు రాష్ట్రాలే, ఇక్కడ బాగానే ఉంది
  • హైదరాబాద్ లో షూటింగ్ లు చేసేందుకు అనువైన పరిస్థితులే ఉన్నాయి 
Tolly wood Biggie Tammareddy response about cine industry shifts to vizag

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో తనను పలకరించిన మీడియాతో తమ్మారెడ్డి మాట్లాడారు. ఈ సినిమా తీయడానికి ముందు ఈ కథను తనకు వినిపించారని, కొన్ని సూచనలు చేశానని అంతకన్నా తన ‘ఇన్ వాల్వ్ మెంట్’ ఏమీ లేదని, తనపై ఉన్న గౌరవం, అభిమానంతో తన పేరు కూడా వేశారని, అందుకు కృతఙ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ఈ సినిమా బాగుందని, తన పేరు వేసినందుకు కొంత గర్వంగా కూడా ఉందని చెప్పారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిపోతుందన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, అటువంటి పరిస్థితి ఏం లేదని, ఇక్కడి నుంచి వెళ్లదని, వెళ్లాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. హైదరాబాద్ లో షూటింగ్ లు చేసేందుకు అనువైన పరిస్థితులు లేవన్న మాట వాస్తవం కాదని స్పష్టం చేశారు.

ఇలా మాట్లాడే వాళ్లను చూస్తుంటే కోపం వస్తోంది

వైజాగ్ లో ఎప్పటి నుంచో షూటింగ్స్ చేస్తున్నామని, ‘పలాస 1978’ షూటింగ్ మొత్తం పలాసలోనే తీశామని, ఒక్క ఫ్రేమ్ కూడా బయట ఎక్కడా తీయలేదని చెప్పారు. హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ విశాఖకు ఎప్పుడు మారుతుందంటూ మాట్లాడే వాళ్లను చూస్తుంటే కోపం వస్తోందని, ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అని ప్రశ్నించారు.

తెలంగాణ, ఆంధ్రా రెండూ తెలుగు రాష్ట్రాలేనని, ఇక్కడ బాగానే ఉందని చెప్పారు. ఆంధ్రా నుంచి సూపర్ హిట్స్ తీసిన కొత్త ప్రొడ్యూసర్స్ ఉన్నారని, దగ్గుబాటి సురేశ్ వాళ్ల స్టూడియో వైజాగ్ లో ఇప్పటికే నడుస్తోందని చెప్పారు. ఇన్సెంటివ్స్ ఇచ్చి కొత్తగా వచ్చే కుర్రాళ్లను, ఆసక్తితో ఉన్న యువతను అక్కడికి తీసుకెళ్లాలి గానీ, ఇక్కడున్నవాళ్లను అక్కడికి రమ్మంటే ఏమొస్తాం? అని ప్రశ్నించారు.

More Telugu News