Bonda Uma: ఇంకో పాతికేళ్లయినా జగన్ ఇచ్చిన స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకోలేరు: బోండా ఉమ

  • ఏపీలో ఏ గ్రామానికి వెళ్లినా జగన్ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతున్నారు
  • 25 లక్షల మంది పేదలకు సెంటు భూమి ఇస్తారన్నది ‘బోగస్’
  • నివాసయోగ్యంగా ఉండే స్థలాలను పేదలకు ఇవ్వాలి
Bonda Uma Comments on YSRCP Government

ఏపీలో ఏ గ్రామానికి వెళ్లినా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై, ఆ ప్రభుత్వ పనితీరుపై గగ్గోలు పెడుతున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వానికి పరిపాలన చేతగాదని, అనుభవం లేని విధానాలను అవలంబిస్తూ తుగ్లక్ వైఖరితో జగన్ సర్కార్ నడుస్తోందని దుయ్యబట్టారు.

పేదలకు ఇళ్ళ స్థలాల పేరిట పనికిరాని వాటిని ప్రభుత్వం ఇస్తోందని, ప్రజల బలహీనతలతో ఆడుకుంటోందని, ఈ వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రల్లో వైసీపీ నాయకుల బాగోతాలు బయటపెడతామని హెచ్చరించారు. లెక్కలు చెప్పడం కాదు, నలభై ఐదు వేల ఎకరాలను ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేసింది? ఎక్కడ కొనుగోలు చేసింది? చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ జిల్లాలో ఎంత స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందో, ఏ ఊరిలో ఎంత మంది పేదలకు స్థలాలు ఇచ్చారో చెప్పాలని అన్నారు.

టీడీపీ హయాంలో బ్రహ్మాండమైన ఇళ్లు కట్టించి, పేదోడి కలను నిజం చేశామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీరు అలా లేదని, రాష్ట్రంలోని  25 లక్షల మంది పేదలకు సెంటు భూమి ఇస్తామనేది ‘బోగస్’ అని విమర్శించారు. ఈ అంశంపై చర్చకు రావాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇంకో పాతికేళ్లయినా జగన్ ఇచ్చిన స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకోలేరని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నివాసయోగ్యంగా ఉండే స్థలాలను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News