Kieron Pollard: 500 టీ20లు.. 10వేలు పరుగులు.. ఒకే ఒక్కడు కీరన్‌ పొలార్డ్‌

Kieron Pollard joins 10000 runs club in his 500th T20 match
  • వెస్టిండీస్‌ క్రికెటర్‌‌ పొలార్డ్‌ అరుదైన ఘనత
  • 500 టీ20లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌‌గా రికార్డు
  • పొట్టి ఫార్మాట్‌లో గేల్‌ తర్వాత అత్యధిక పరుగులు
వెస్టిండీస్‌ విధ్వంసకర క్రికెటర్ కీరన్‌ పొలార్డ్‌ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఐదొందల మ్యాచ్‌లు ఆడి, పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక మధ్య బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20లో అతను ఈ ఘనత సాధించాడు.

టీ20 ఫార్మాట్‌లో అతనికిది 500వ మ్యాచ్‌. ఇందులో 72 ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌లు కాగా, 148 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. దేశవాళీ టోర్నీలు, ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్‌ల్లో మిగతా మ్యాచ్‌లు ఆడాడు. దాంతో ఈ ఫార్మాట్‌లో ఐదొందల మైలురాయి చేరుకున్న తొలి క్రికెటర్‌‌గా నిలిచాడు. మరే క్రికెటర్‌‌ కూడా అతనికి చేరువగా కూడా లేడు.

ఇక విండీస్‌కే చెందిన డ్వేన్‌ బ్రావో 454 మ్యాచ్‌లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉండగా, క్రిస్‌ గేల్‌ 404 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, లంకపై 15 బంతుల్లో 34 రన్స్ చేసిన పొలార్డ్‌ టీ20ల్లో పదివేల రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. అయితే, పొట్టి ఫార్మాట్‌లో అతనికంటే ముందు క్రిస్‌ గేల్‌ ఈ ఘనత సాధించాడు. గేల్‌ ఇప్పటిదాకా 13256 పరుగులు సాధించాడు. పొలార్డ్‌ ఖాతాలో 280 వికెట్లు కూడా ఉన్నాయి. కాగా, శ్రీలంకపై 25 పరుగుల తేడాతో గెలిచిన విండీస్‌ సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.
Kieron Pollard
most matches
500th T20 match
10
000-runs club
t20 internationals

More Telugu News