Rapes: కోర్టుల్లో మూలుగుతున్న అత్యాచార, పోక్సో కేసులు.... పెండింగులో వున్నవి 2.4 లక్షలకు పైనే!

  • పెండింగ్ కేసులపై ప్రశ్నించిన జనతాదళ్ యునైటెడ్ ఎంపీ
  • లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి 
  • కొత్తగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల ఏర్పాటు జరుగుతోందని వెల్లడి
  • ఒక్కో కోర్టు ఏడాదికి 165 కేసులు పరిష్కరించాల్సి ఉంటుందన్న మంత్రి
Union minister Ravi Shankar Prasad says lakhs of pending cases across country

మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులకు సంబంధించిన కేసులపై లోక్ సభలో కేంద్రం స్పందించింది. అత్యాచారాలు, పోక్సో చట్టం కేసులు గతేడాది డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 2.4 లక్షలకు పైనే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జనతాదళ్ యునైటెడ్ సభ్యుడు రాజీవ్ రంజన్ సింగ్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

"ఆయా హైకోర్టుల నుంచి సేకరించిన సమాచారం మేరకు 2019 డిసెంబరు 31 నాటికి పెండింగ్ లో ఉన్న రేప్, పోక్సో చట్టం కేసులు 2,44,001. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 66,994 పెండింగ్ కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్ర (21,691), పశ్చిమ బెంగాల్ (20,511) ఉన్నాయి" అని మంత్రి వివరించారు.

అంతేకాదు, పెండింగ్ కేసుల పరిష్కారానికి దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధమైందని తెలిపారు. ఇప్పటికే 195 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటయ్యాయని, అయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్తగా ఒక్క ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కూడా రూపుదిద్దుకోలేదని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్రం విధివిధానాలు అనుసరించి ఒక్కో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఏడాదికి 165 కేసులు పరిష్కరించాల్సి ఉంటుందని వివరించారు.

More Telugu News