Kanna Lakshminarayana: అవి విషపు జీవోలు... వాటి బారినపడకుండా పనిచేయాలి: కన్నా

  • గుంటూరులో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం
  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతలకు కన్నా కర్తవ్య బోధ
  • వైసీపీ దొడ్డిదారిన గెలిచేందుకు ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యలు
Kanna lashes out YSRCP government over latest orders

ఏపీలో మరికొన్నిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం విషపు జీవోలు విడుదల చేస్తోందంటూ ఆరోపించారు.

డబ్బు, మద్యం పంపిణీ చేసేవారిపై చర్యలు ఉంటాయంటూ జీవోలు ఇస్తున్నారని, తద్వారా విపక్షాలను ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని, అందుకు ఈ విషపు జీవోలే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

వలంటీర్లు ఎవరిపై ఫిర్యాదులు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామనడం వైసీపీ సర్కారు వైఖరిని సూచిస్తోందని అన్నారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున ఈ విషపు జీవోల బారినపడకుండా పనిచేయాలంటూ పార్టీ నేతలకు ఉద్బోధించారు. ఈ ఎన్నికల్లో తాము జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్టు కన్నా వెల్లడించారు.

More Telugu News