India: మహిళల టీ-20 వరల్డ్ కప్... ఆడకుండానే ఫైనల్ కు చేరిన భారత్!

  • వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్
  • గ్రూప్ దశలో మెరుగైన స్థితిలో ఇండియా
  • ఫైనల్స్ కు చేరినట్టు ప్రకటించిన రిఫరీ
India Reaches Finals in Women T 20 World Cup

మహిళల టీ-20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఫైనల్స్ కు చేరింది. నేడు సిడ్నీలో ఇంగ్లండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ని భారత్ ఆడాల్సివుండగా, వర్షం అడ్డుగా నిలిచింది. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా, గ్రూప్ దశలో మెరుగైన పాయింట్లు కలిగివున్న కారణంగా ఇండియా ఫైనల్స్ కు క్వాలిఫై అయిందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

కాగా, మరో సెమీఫైనల్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో భారత జట్టు ఫైనల్ ఆడనుంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించిన తరువాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ, దురదృష్టవశాత్తూ మ్యాచ్ రద్దయిందని, అయితే క్రికెట్ నిబంధనలను ఏ జట్టు అయినా పాటించాల్సిందేనని వ్యాఖ్యానించింది.

టీ-20 వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన రోజు నుంచి భారత జట్టులోని అమ్మాయిలు అత్యుత్తమంగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆమె, ఫైనల్ లోనూ ఇదే విధమైన ప్రతిభను కనబరుస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఫైనల్స్ లో తమ ప్రత్యర్థి ఎవరన్న విషయమై ఆలోచించడం లేదని, షెఫాలి, స్మృతి వంటి ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని అంది. ఫైనల్స్ లో ఓ జట్టుగా ప్రతి ఒక్కరమూ అత్యుత్తమంగా రాణించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తామని చెప్పింది.

ఇక ఇంగ్లండ్ కెప్టెన్ హెథర్ నైట్ మాట్లాడుతూ, ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించింది. రిజర్వ్ డే లేకపోవడం తమ జట్టు అవకాశాలను దెబ్బతీసిందని వాపోయిన ఆమె, ఇకనైనా నిబంధనలను మార్చాలని సూచించింది. గ్రూప్ స్టేజ్ లో ఇండియా అద్భుతంగా రాణించి 8 పాయింట్లను సొంతం చేసుకుందని, తమ జట్టు ఆరు పాయింట్లనే కలిగివుండటం ఎంత నష్టాన్ని చేకూర్చిందో ఇప్పుడు తెలుస్తోందని నైట్ వెల్లడించింది.

More Telugu News