Hyderabad: హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ ఖాళీపై తెలంగాణ సర్కారు సీరియస్!

  • వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
  • స్పష్టం చేసిన ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్
  • ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఐటీ ఉద్యోగులు
  • ఐబీఎం, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఇప్పటికే ఖాళీ
  • బోసిపోయిన హైటెక్ సిటీ ప్రాంతం
Mind Space Vacent over Corona Affect

కరోనా భయంతో హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ లోని ఐటీ కంపెనీలు, తమ ఉద్యోగులను ఇళ్లకు పంపించి వేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇవ్వద్దని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఆదేశించారు. ఐటీ కారిడార్ లో నోడల్ అధికారిగా సీపీ సజ్జనార్ ను నియమించామని, ఎవరైనా కరోనాపై వదంతులను వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కాగా, తమ ఉద్యోగినికి కరోనా వైరస్ సోకిందని డీఎస్ఎం సంస్థ ప్రకటించడంతో రహేజా సెజ్ లో అలజడి రేగింది. ఇటలీకి వెళ్లి వచ్చిన తమ ఉద్యోగినికి కరోనా నిర్ధారణ అయినట్టు డీఎంఎస్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం ఇస్తూ, వెంటనే మైండ్ స్పేస్ లోని ఆఫీసుతో పాటు బ్రైట్ స్పేస్ భవనాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో సంస్థ ఉద్యోగులంతా ఇంటికి చేరారు.

ఆ వెంటనే పలు కంపెనీలు ఉద్యోగులను ఇళ్లకు పంపాయి. మొత్తం 11 వేల మంది కార్యాలయాలను ఖాళీ చేయడంతో ఐటీ కారిడార్ బోసిపోయింది. ఐబీఎం, కాగ్నిజెంట్, ఇంటెల్ వేరిజాన్, యష్ టెక్నాలజీస్ తదితర సంస్థలు కార్యాలయాలకు రావద్దని ఉద్యోగులను ఆదేశించాయి. ఇప్పటివరకూ డీఎస్ఎం ఉద్యోగినికి వైరస్ సోకినట్టు అధికారికంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ, కంపెనీలను మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించడాన్ని జయేశ్ రంజన్ తప్పుబట్టారు.

More Telugu News