ఇంగ్లండ్ తో సెమీఫైనల్స్ రేపే.. టీమిండియాకు గట్టి పోటీ తప్పదు!

04-03-2020 Wed 16:47
  • టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, ఇంగ్లండ్ సెమీస్ రేపు
  • జోరుమీదున్న టీమిండియా
  • ఇప్పటిదాకా ఫైనల్‌ చేరని భారత జట్టు
  • భారత్‌పై ఇంగ్లండ్‌కు మెరుగైన రికార్డు
Tough test awaits for india against england in t20 world cup semis
లీగ్‌ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన భారత మహిళల జట్టు కీలక సవాల్‌కు రెడీ అయింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్ఠ ఇంగ్లండ్ జట్టుతో హర్మన్ ప్రీత్‌ కౌర్‌‌ నేతృత్వంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. సిడ్నీ గ్రౌండ్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

అన్ని విభాగాల్లో బలంగా ఉన్న భారత్ జట్టులో ఫుల్ జోష్‌ కనిపిస్తోంది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ భీకరమైన ఫామ్‌లో ఉండడం జట్టుకు ప్లస్ పాయింట్. అలాగే, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా బాధ్యతాయుతంగా ఆడుతోంది. బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. స్పిన్నర్లు, పేసర్లు అద్భుతంగా రాణిస్తూ గ్రూప్‌ దశలో జట్టుకు విజయాలు కట్టబెట్టారు. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే తొలిసారి ఫైనల్‌ చేరడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అయితే, సీనియర్‌‌ ప్లేయర్లు  స్మృతి మంధాన, హర్మన్‌, వేదా కృష్ణ, ఆల్‌రౌండర్‌‌ దీప్తి శర్మ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది.

19 టీ20ల్లో నాలుగే విజయాలు


మరోవైపు ఇంగ్లండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. 2017 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు రెండేళ్ల కిందట వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లోనూ టీమిండియాను ఆ జట్టు ఓడించింది. అదే జోరుతో హ్యాట్రిక్‌ విజయంతో ఫైనల్‌ చేరాలని ఇంగ్లిష్ టీమ్‌ కోరుకుంటోంది. పైగా ఆ జట్టుతో ఇప్పటిదాకా 19 టీ20లు ఆడిన భారత్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలిచి 15 సార్లు ఓడిపోయింది. బ్యాటింగ్‌లో నటాలీ సీవర్‌‌, హేథర్‌‌ నైట్‌ దుమ్ముదులుపుతున్నారు. బౌలింగ్‌లో  సోఫీ ఎక్లెస్టన్, అన్యా ష్రబ్సోల్, సారా గ్లెన్‌ చెలరేగుతున్నారు.

మరి, ఇంగ్లండ్‌ను ఓడించి మన అమ్మాయిలు ఫైనల్‌ చేరుతారో లేదో చూడాలి. కాగా, గురువారం మధ్యాహ్నం జరిగే రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీ పడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకుంటాయి.