Amit Shah: హోలీ వేడుకలకు అమిత్​ షా దూరం.. ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలు వద్దని విజ్ఞప్తి

  • తాను వేడుకల్లో పాల్గొనబోనని ఇప్పటికే ప్రకటించిన మోదీ
  • బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా దూరంగానే..
  • కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయించినట్టు వెల్లడి
Amit Shah JP Nadda Also Decides To Skip Holi Event

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోలీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకలకు దూరంగా ఉంటానని బుధవారం ఉదయమే ప్రకటించారు. కొద్దిగంటల్లోనే అమిత్ షా, జేపీ నడ్డా తాము కూడా దూరంగా ఉంటామంటూ ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. వీలైనంత వరకు ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా ఉండాలని సూచించారు.

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి: అమిత్ షా

‘‘భారతీయులకు హోలీ ఎంతో ముఖ్యమైన పండగ. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడే కార్యక్రమాలు వద్దు. మీరు, మీ కుటుంబ ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోండి” అని అమిత్ షా ట్వీట్ చేశారు.

జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి: నడ్డా

‘‘ప్రపంచమంతా కరోనా వైరస్ తోయుద్ధం చేస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా దేశాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం హోలీ జరుపుకోవద్దని, ఎక్కడా హోలీ వేడుకల్లో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నాం. జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి” అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు.

More Telugu News