Odisha: ప్రియుడితో పరారైన భార్య... హత్యారోపణతో జైలుపాలైన భర్త!

  • పెళ్లయిన రెండు నెలలకు భార్య అదృశ్యం 
  • అల్లుడే చంపేశాడని అత్తింటివారి ఫిర్యాదుతో జైలు 
  •  ఏడేళ్ల తర్వాత ప్రియుడితో ఆమె సహజీవనం చేస్తున్నట్లు గుర్తింపు
missing wife traced after seven years

హత విధీ అంటే ఇదేనేమో. పెళ్లి చేసుకుని జీవన మాధుర్యాన్ని అనుభవించాలనుకున్న ఆ యువకుడికి ఆమె తీరని అన్యాయం చేసింది. పెళ్లికి ముందే ప్రేమించిన యువకుడితో ఉన్నట్టుండి పరారైంది. ఏ పాపం ఎరుగని ఆ యువకుడు మాత్రం హత్యారోపణలు ఎదుర్కొంటూ ఏడేళ్లుగా మానసిక క్షోభ అనుభవించాడు. 

పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే....ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లాకు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2013లో పెళ్లయింది. రెండు నెలల తర్వాత అతని భార్య కనిపించకుండా పోయింది. వరకట్నం కోసం తమ కుమార్తెను అల్లుడే హత్యచేసి ఆమె శవాన్ని దొరక్కుండా చేశాడని అత్తింటి వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

తాను ఏ పాపం ఎరుగనని, తన మొర వినాలని అతను మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. నెలరోజులపాటు జైలు జీవితం అనుభవించాక బెయిల్ పై బయటకు వచ్చాడు. చేయని తప్పుకు సమాజంలో దోషిగా తిరగాల్సి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆమె కోసం వెదకని చోటంటూ లేదు. తనకున్న అన్ని మార్గాలను ఉపయోగిస్తూ గడచిన ఏడేళ్లుగా అతను ఆమెను వెతికే పనిలోనే ఉన్నాడు. ఎట్టకేలకు అతని కృషి ఫలించింది. తన భార్య ఇంటి నుంచి అదృశ్యమై పూరీ జిల్లా పిప్పిలిలో రాజీవ్ లోచన్ మహరాణా అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని గుర్తించాడు.

వెంటనే అదే విషయాన్ని తెలియజేస్తూ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పూరీ చేసుకుని రాజీవ్ తోపాటు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో రాజీవ్, ఈ యువతి ప్రేమించుకున్నారని, తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని తేలింది. 

More Telugu News