Roja: మద్యం కమీషన్లకు బానిసలైన టీడీపీ వాళ్లను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపాలని డిసైడయ్యాం: రోజా సెటైర్లు

  • టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారింది
  • నాడు సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకం వేస్ట్ 
  • చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా ఉన్నారు
ysrcp mla Roja comments on TDP Leaders

మద్యం కమీషన్లకు బానిసలై కొట్టుకుంటున్న టీడీపీ వాళ్లందరినీ కూడా డీ–అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లి నయం చేయాల్సిన అవసరం ఉందని ‘ఈ రోజునే డిసైడ్ అయ్యాం’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు చేశారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తొమ్మిది నెలల నుంచి చూస్తున్నామని, మంచి బ్రాండ్స్ లేవని, మద్యం షాపులు తెరిచి ఉంచే సమయం పెంచాలని, మద్యం ధరలు తగ్గించమని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిలా లేరని, తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా నలభై మూడు వేల బెల్టు షాపులను తీసేసిన చరిత్ర ఉందా? దమ్ముంటే నిరూపిస్తారా?’ అంటూ చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు ఆమె సవాల్ విసిరారు. నలభై మూడు వేల బెల్టు షాపులను తొలగించిన ఘనత తమ ప్రభుత్వానిదని, మహిళలు ‘హ్యాట్సాఫ్’ చెబుతున్నారని అన్నారు. టీడీపీ హయాంలో బార్ల సంఖ్యలను తగ్గించిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించిన రోజా, ఇరవై శాతం వైన్ షాపులను, నలభై శాతం బార్లను తగ్గించిన ఘనత జగన్ ప్రభుత్వానిదని కొనియాడారు.

టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిందని, టార్గెట్లు పెట్టి మరి మద్యం విక్రయించారని విమర్శించారు. బెల్టు షాపులను నిర్మూలిస్తామంటూ నాడు సీఎంగా చంద్రబాబునాయుడు తొలిసంతకం చేశారని, ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి నలభై మూడు వేల బెల్టు షాపులు ఉన్నాయంటే ‘ఆయన సంతకం ఎంత వేస్ట్’ అనే విషయం అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు హయాంలో ప్రతి ఏటా ఇరవై శాతం మద్యం అమ్మకాలను పెంచుకుంటూ పోయి మహిళల తాళిబొట్లు తెగే విధంగా పరిపాలించిన బాబు పాలనను మహిళలు మర్చిపోలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ సిండికేట్ తో రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకున్నారని, నాడు ఎక్సైజ్ మంత్రిగా ఉన్న జవహర్ ‘హెల్త్ డ్రింక్‘ని ఏ విధంగా ప్రవేశపెట్టి ఓ ప్రమోటర్ గా పనిచేశారు? అసలు ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

More Telugu News