Bonda Uma: గ్రామవాలంటీర్లు మద్యం కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు: బోండా ఉమ ఆరోపణలు

  • ఏపీలో అతిపెద్ద లిక్కర్ మాఫియాకు జగన్ ప్రభుత్వం తెరలేపింది
  • ప్రతిరోజూ కొన్ని లక్షల లీటర్ల కల్తీ మద్యం తయారవుతోంది
  • పక్క రాష్ట్రాల్లోని లిక్కర్ ను వైసీపీ నాయకులు ఏపీకి తెచ్చి అమ్ముతున్నారు
Bonda Uma severe allegations on Grama Volunteers

ఏపీలో అతిపెద్ద లిక్కర్ మాఫియాకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపణలు గుప్పించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో మద్యం సిండికేట్స్ పై పెద్ద యుద్ధం జరిగింది, ఆరోజు మద్యం సిండికేట్ లో బొత్స సత్యనారాయణ లాంటి పెద్ద తలకాయలు ఉంటే, ఈరోజున సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు  ఈ సిండికేట్ ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులందరూ కలిసి తమకు నచ్చిన వాళ్లతో డిస్టిలరీస్ ఏర్పాటు చేసి, బినామీ పేర్లతో ఈ దందా కొనసాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘మేము చెప్పేది వాస్తవమా? కాదా?' అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని ‘బూమ్’, ‘జార్డిస్ బార్’ బ్రాండ్స్ వంటివి వైసీపీ పది నెలల పాలనలోనే పుట్టుకొచ్చాయని, కల్తీమద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని, ప్రతిరోజూ కొన్ని లక్షల లీటర్ల కల్తీ మద్యం తయారవుతోందని ఆరోపించారు. పక్క రాష్ట్రాలలో విక్రయించే లిక్కర్ ను వైసీపీ నాయకులు తీసుకొస్తున్నారని, ప్రభుత్వ మద్యం దుకాణాలు రాత్రి ఎనిమిది గంటలకు క్లోజ్ అవగానే, ఎనిమిదిన్నర నుంచి వైసీపీ షాపులు ఓపెన్ అవుతాయని, ఈ షాపులన్నీ మద్యం డోర్ డెలివరి చేస్తున్నాయని ఆరోపించారు. పింఛన్లే కాదు.. మద్యాన్ని కూడా గ్రామ వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.  

More Telugu News