Nirbhaya: ఈ నెల మూడో వారంలో నలుగురికీ ఉరి శిక్ష అమలు ఖాయమంటున్న న్యాయనిపుణులు!

  • చట్టపరమైన అవకాశాలు వాడుకుంటున్న నిర్భయ దోషులు
  • మూడు సార్లు డెత్ వారెంట్ నుంచి తప్పించుకున్న నలుగురు
  • తుది వారెంట్ వస్తే రెండు వారాల్లో ఉరి
Nirbhaya Convicts Hang in Third Week

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, మహిళలపై జరిగే అకృత్యాలను నివారించేందుకు చట్టాల సవరణ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేసేలా చేసిన నిర్భయ కేసులో, దోషులు నలుగురికీ ఈ నెల మూడోవారంలో శిక్ష అమలు జరిగి తీరుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిందితులు క్షమాభిక్షకు అర్హులు కారని, వీరి చేసిన ఘోరం సామాన్యమైనది కాదని అభిప్రాయపడుతున్న వారు, ప్రజలను శాంతిపజేయడానికైనా ప్రభుత్వం వీరికి శిక్ష అమలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

నిర్భయ కేసులో దోషులు, ఇప్పటివరకూ తమకు ఉన్న అన్ని న్యాయ, చట్ట పరమైన అవకాశాలను వాడుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు క్షమాభిక్ష, క్యూరేటివ్ పిటిషన్, రివ్యూ పిటిషన్ లను దాఖలు చేస్తూ, దాదాపు మూడు నెలలుగా శిక్షను తప్పించుకుంటూ వస్తున్నారు.

2012లో వీరంతా నేరానికి పాల్పడగా, ఈ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. విచారణ అనంతరం ఈ సంవత్సరం జనవరి 22న తొలి డెత్ వారెంట్ జారీ కాగా, దానిపై 17న స్టే విధించబడింది. ఆపై ఫిబ్రవరి 1న ఉరి తీయాలని రెండో డెత్ వారెంట్ జారీ కాగా, జనవరి 31న న్యాయస్థానం స్టే విధించింది. ఆపై మార్చి 3న ఉరి తీయాలని మూడో డెత్ వారెంట్ జారీ కాగా, అది కూడా వాయిదా పడింది. దీనికి కారణం దోషులంతా వరుసగా ఒకరి తరువాత ఒకరు కోర్టులను ఆశ్రయిస్తూ ఉండటమే.

ఇది మరణ శిక్షకు సంబంధించిన విషయం కాబట్టి, దోషులకు ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకునేందుకు వీలు కల్పించాలన్న ఉద్దేశంతో న్యాయస్థానాలు అన్ని పిటిషన్లనూ విచారణకు స్వీకరిస్తూ, శిక్ష అమలును వాయిదా వేస్తూ వచ్చాయి. ఇక ఇప్పుడు దోషులకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి.

ఇక పటియాలా హౌస్ కోర్టు చేతిలో వీరి మరణశాసనం దాగుంది. కోర్టు ఎప్పుడు డెత్ వారెంట్ ను జారీ చేస్తే, అప్పటి నుంచి రెండు వారాల్లో ఉరి తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ దఫా, దోషుల్లో ఎవరికీ కోర్టును ఆశ్రయించే వీలు లేకుండా పోగా, శిక్ష అమలు జరిగి తీరుతుందని అంచనా.

వాస్తవానికి ఏ ఆటంకం లేకపోయివుంటే, ఈ రోజు సూర్యోదయం సమయానికి నలుగురు దోషులకూ శిక్ష అమలు పూర్తి అయివుండేది. వారి గురించిన వార్తలే దేశవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వస్తుండేవి. కాగా, మరో రెండు మూడు రోజుల్లో వీరిపై డెత్ వారెంట్ జారీ అవుతుందని, మూడో వారంలోగా వారి ఉరితీత ఖరారైనట్టేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 

More Telugu News