New Delhi: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పశ్చిమ ఢిల్లీ వాసులు!

  • వీధుల్లో పరుగులు పెట్టిన కొంతమంది
  • తీవ్ర ఆందోళనలతో పోలీసులకు ఫేక్ కాల్స్
  • వందలాది కాల్స్ వచ్చాయన్న అధికారులు
Hundreds of Fake Calls for Delhi Police

అసలే ప్రజలు భయం భయంగా గడుపుతున్న వేళ... సాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే వారు స్పందించడం లేదని విమర్శలు... సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఓ వర్గం, అనుకూలంగా మరో వర్గం ఎప్పుడు ఎక్కడ నిరసనలకు దిగుతారో తెలియని పరిస్థితి. ఇంతటి స్థితిలోనూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి, శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని భావిస్తున్న పోలీసులను పశ్చిమ ఢిల్లీ వాసులు ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పటికే ఢిల్లీ అల్లర్లలో 46 మంది మృత్యువాత పడగా, వందలాది మందికి గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని వచ్చిన ఉత్తర్వులతో పోలీసులు అప్రమత్తంగా ఉండగా, వందలాది మంది వారిని ఫేక్ కాల్స్ తో ఇబ్బంది పెట్టారు.

నిన్న ఆదివారం నాడు ఒక్కరోజే ఢిల్లీ పోలీసులకు 481 ప్యానిక్ కాల్స్ వచ్చాయి. ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకూ పశ్చిమ ఢిల్లీలోని 12 పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ఫోన్ కాల్స్ రాగా, పోలీసులకు నిద్ర లేకుండా పోయింది. తిలక్ నగర్ ప్రాంతం నుంచి 148, ఖయ్యాలా పరిధిలో 143 తప్పుడు కాల్స్ వచ్చాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాజౌరీ గార్డెన్, పంజాబీ బాగ్, హరి నగర్, మోతీ నగర్, జనక్ పురి నుంచి వరుసగా 96, 26, 24, 17, 11 కాల్స్ వచ్చాయని, అక్కడ ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరుగకుండానే ప్రజలు ఆందోళనతో ఈ ఫోన్ కాల్స్ చేశారని అధికారులు అంటున్నారు.

"ఇవన్నీ బోగస్ ఫోన్ కాల్సే. అయితే వీటిని ప్రజలు భయాందోళనలతో చేశారని భావిస్తున్నాం. నగరమంతా ఇదే పరిస్థితి నెలకొని వుంది" అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, తాము ఏ కాల్ నూ అలక్ష్యం చేయలేదని, అన్ని కాల్స్ అటెండ్ చేసి, ఆయా ప్రాంతాలకు సిబ్బందిని పంపించామని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లో పరుగులు పెట్టారని, దీంతో మిగిలిన వారు పోలీసులకు ఫోన్ కాల్స్ చేయడం ప్రారంభించారని అన్నారు. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్ సైతం అసత్య వార్తలను ప్రసారం చేశాయని, పోలీసు స్టేషన్లపై రాళ్లు రువ్వినట్టు వార్తలు వచ్చాయని అన్నారు.

More Telugu News