Go Air: గో ఎయిర్ విమానంలోకి పావురాలు... పట్టేందుకు ప్రయాణికుల తంటాలు... వీడియో ఇదిగో!

Two Pegions Enter into Go Air Flight Causes Delay
  • అహ్మదాబాద్ నుంచి జైపూర్ కు విమానం
  • టేకాఫ్ కు సిద్ధమైన వేళ కనిపించిన పావురాలు
  • కాసేపు తలుపులు తెరచి ఉంచడంతో బయటకు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న వేళ, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ, రెండు పావురాలు లోనికి ప్రవేశించాయి. బయటకు ఎలా వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్న పావురాలు, అటూ, ఇటూ ఎగురుతూ ఉంటే, వాటిని పట్టుకునేందుకు ప్రయాణికులు తంటాలు పడ్డారు. ఈ ఘటన అహ్మదాబాద్ నుంచి జైపూర్ కు బయలుదేరిన గో ఎయిర్ విమానంలో జరుగగా, విమానం సుమారు 30 నిమిషాలు ఆలస్యం అయింది.

గో ఎయిర్ జీ8 702 సర్వీస్, టేకాఫ్ కు సిద్ధమైన సమయంలో పావురాలు లోపలికి వచ్చాయి. వాటిని పట్టుకోవడంలో ప్రయాణికులతో పాటు క్యాబిన్ క్రూ కూడా ఇబ్బంది పడ్డారు. చివరకు విషయాన్ని ఏటీసీకి వెల్లడించి, విమానం తలుపులను తెరిచి పెట్టడంతో, అవి బయటకు ఎగిరిపోయాయి. ఈ మొత్తం ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి.

జరిగిన ఘటనతో ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడినందున విచారం వ్యక్తం చేస్తున్నట్టు గో ఎయిర్, ఓ ప్రకటన వెలువరించింది. సాయంత్రం 6.15 గంటలకు జైపూర్ చేరాల్సిన విమానం 6.45కు చేరిందని పేర్కొంది. పక్షులు విమానాల్లోకి ప్రవేశించడం అసాధారణమైన విషయమని ప్రయాణికులు కొందరు వ్యాఖ్యానించారు. విమానం ఎగిరే సమయంలో పక్షులు అడ్డు వచ్చి విమానం ఇంజన్ లో చిక్కుకుంటే, క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News