హార్దిక్​ పటేల్​కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

28-02-2020 Fri 17:03
  • పటీదార్ ర్యాలీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • మార్చి 6వ తేదీ వరకూ పటేల్ ను అరెస్ట్ చేయకూడదని ఆదేశం
  • 2015లో జరిగిన ర్యాలీలో హింస చెలరేగడంతో హార్దిక్‌పై కేసు
Hardik Patel gets bail in Patidar rally case
గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్‌ నాయకుడు హార్దిక్ పటేల్‌కు ఊరట లభించింది. 2015లో పటీదార్ ఉద్యమ సమయంలో చెలరేగిన హింసకు సంబంధించి నమోదైన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్ తీర్పు ఇచ్చింది.

కేసు తదుపరి విచారణ జరిగే మార్చి 6వ తేదీ వరకు పటేల్ ను అరెస్టు చేయకూడదని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పటేల్ తొలుత గుజరాత్ హైకోర్టును కోరారు. కానీ, ఆయన పిటిషన్‌ను ఆ కోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హార్దిక్ నేతృత్వంలోని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి 2015లో అహ్మాదబాద్ లో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో హింస చెలరేగింది. దాంతో, హార్దిక్‌పై కేసు నమోదైంది.